వికారాబాద్, అక్టోబర్ 28 : జిల్లాలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు వికారాబాద్‌లోని మద్గుల్ చిట్టంపల్లి శివారులో ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.21,570, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వికారాబాద్ పీఎస్ పరిధిలోని సూర్యప్రకాశ్ కాలనీలో ఆటో ట్రాలీల్లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 7.8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, 2 ఆటోలను సీజ్ చేసి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ కాలనీలో ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని.. వారి నుంచి రూ.16,120, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని యాలాల పీఎస్‌లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంతారం గ్రామంలో ఆరుగురు పేకాటరాయుళ్లను పట్టుకొని వారి నుంచి రూ.10,090, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందన్నారు. వారిపై తాండూరు పీఎస్‌లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల గురించి టాస్క్‌ఫోర్స్ అధికారులను సంప్రదించడానికి జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సెల్ నం. 8712670022ను సంప్రదించాలన్నారు.