వికారాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో జోరందుకుంది. ప్రజాప్రతినిధులు మొదలుకొని అధికారులు, ప్రజలందరూ హరిత యజ్ఞంలో భాగం అవుతుండడంతో తెలంగాణకు హరితహారం సామాజిక ఉద్యమంలా సాగుతున్నది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకిరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటుతున్నారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం), పండ్ల మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ ప్రక్రియ చేస్తున్నారు. మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ జియో ట్యాగింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ యాప్లో ఎక్కడెక్కడ ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. ఎక్కడైతే మొక్కలు నాటుతారో అక్కడ నెవిగేషన్తో మొక్కల ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. జియో ట్యాగింగ్ ప్రక్రియతో నాటిన మొక్క ఏ విధంగా ఉందనేది ఆన్లైన్ ఆధారంగా తెలుసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమం స్పీడందుకుంది. అన్ని శాఖలు భాగస్వాములై, ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటే ప్రక్రియ కొనసాగుతున్నది.
ప్రతి గ్రామానికో నర్సరీ
జిల్లాలో ఈ ఏడాది 40.49 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 9.29 లక్షల మొక్కలను నాటడం పూర్తయింది. వెంటనే సంబంధిత మొక్కలపై జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పపాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటుతున్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆయా గ్రామాల్లోని నర్సరీలోని మొక్కలను ఆయా గ్రామ పంచాయతీల్లోనే నాటుతున్నారు. ఏదేని నర్సరీలో తక్కువ మొక్కలున్నట్లయితే పక్క గ్రామపంచాయతీలోని నర్సరీ ద్వారా మొక్కలను సేకరించేలా చర్యలు చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మానం ప్రకారం సంబంధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 40.25 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 38.70 లక్షల మొక్కలను నాటినట్లు అధికారులు తెలిపారు.