పెద్దేముల్ : బృహాత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగం పెంచి పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తట్టేపల్లి గ్రామంలో సుమారు 2గంటల పాటు పర్యటించి బృహత్ పల్లెప్రకృతి వనంలో కొనసాగుతున్న పనులను, గ్రామంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని, పోడు భూముల వివరాల రిజిష్టర్లను, పారిశుధ్య పనులను అధికారులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ.. తట్టేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 473లోని 10ఎకరాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనంలో ఇప్పటికే 10వేల మొక్కలు నాటరు.
అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారా.. ఉపాధ్యాయులు ప్రతి రోజు క్రమం తప్పకుండా వస్తున్నారా.. లేదా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా.. సమయానికి భోజనం పెడుతున్నారా.. విద్యార్థుల సంఖ్య పెరిగిందా.. చిన్నారులకు గుడ్లు ఇస్తున్నారా.. లేదా.. అనే విషయాలను టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ, బీసీ, మైనారిటీ కాలనీల్లో పాదయాత్రగా గ్రామస్తులతో నడుస్తూ వ్యాక్సిన్ వేసుకొని ఇండ్ల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను చేపడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తరువాత గ్రామ పంచాయతీలో అటవీశాఖ పరిధిలో సాగు చేసుకుంటున్న పోడు భూముల రైతుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులను, రైతుల వివరాలు నమోదు చేస్తున్న రిజిష్టర్లను తనిఖీ చేసి పోడు భూముల రైతుల వివరాలు పకడ్బందీగా పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మండల ఎంపీవో షేక్ సుష్మా, స్థానిక ఎంపీటీసీ శంకర్, నాయకులు గోపాల్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.