తాండూరు, సెప్టెంబర్ 26 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తాండూరు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో వేల కోట్ల అభివృద్ధి పనులు పూర్తి కాగా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల నిర్మాణాలతో తాండూరు విస్తరణ పుంజుకుంది. రోడ్లు, ఆనకట్టలతో పాటు పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరిన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు పూర్తి చేసి పలు నూతన పనులను ప్రారంభిస్తున్నారు. దీంతో తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతున్నది.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సమాచార, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి బుధవారం తాండూరులో పర్యటించనున్నారు. రూ.58.23 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, మాతా శిశు ఆస్పత్రిలో దుకాణాల సముదాయానికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.10 కోట్లతో వ్యవసాయ మార్కెట్ నిర్మాణం, రూ.10.60 కోట్లతో బషీరాబాద్‌లో 30 పడకల ఆసుపత్రి, రూ.10.23 కోట్లతో కందనెల్లి, జినుగుర్తి, చంద్రవంచ, జుంటుపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు, రూ.1.35 కోట్లతో గ్రంథాలయ భవన నిర్మాణం, ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1.05 కోట్లతో మాతా శిశు ఆసుపత్రిలో దుకాణాల సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
తాండూరు పట్టణంలోని విలేమూన్ మైదానంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. బుధవారం తాండూరులో మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి పర్యటించనునున్నట్లు తెలిపారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విలేమూన్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని గ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైనికుల్లా కృషి చేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కాకుండా బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.