వికారాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు బరితెగిస్తున్నారు. పలు రెవెన్యూ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాదు ధరణి ఆపరేటర్, ఆర్ఐ నుంచి తహసీల్దార్ వరకు ఒక్కో స్థాయిలో వారు అడిగినంత ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుంది.. లేదంటే ఏదో ఒక కొర్రీ పెట్టి పెండింగ్‌లోనే పెడుతున్నారు. అయితే భూసమస్యలకు సంబంధించి రిపోర్టు ఇచ్చే పని మొదలుకొని భూముల రిజిస్ట్రేషన్ల వరకు అందినకాడికి దండుకుంటున్నట్లు తహసీల్దార్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుక్ చేసుకుంటే సంబంధిత రెవెన్యూ అధికారులకు డబ్బులు ముట్టజెప్పడం తప్పనిసరిగా మారింది !. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే భూమిని కొన్న పట్టాదారును కొందరు తహసీల్దార్లు నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు ధరణి ఆపరేటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వసూళ్లకు గుడ్‌విల్ అంటూ పేరు పెట్టి దండుకుంటున్నారని మండిపడుతున్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తి కాగా నే గుడ్‌విల్ ముట్టజెప్పాలంటూ పలు మండలాల రెవెన్యూ యంత్రాంగం నిబంధన పెట్టడం గమనార్హం. కాగా, ఒక్కో మండలంలో ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలున్నారు. డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తైన పత్రాలను అందజేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువరు మండిపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పూడూరు, పరిగి, వికారాబాద్ మండలాల రెవెన్యూ అధికారులు, సిబ్బంది వసూళ్లకు సంబంధించి పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
కాగా, తహసీల్దార్ల వసూళ్ల బాగోతంపై కలెక్టర్ ప్రతీక్ జైన్ సీరియస్‌గా ఉన్నట్లు.. త్వరలోనే పలువురిపై బదిలీ వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఓ ఎమ్మెల్యే అండదండలతో జిల్లా కేంద్రానికి సమీప మండలంలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజావాణి’లో భూబాధితుల వినతులను కలెక్టర్ రెకమండ్ చేసినా పలు మండలాల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు న్నాయి. కలెక్టర్ చెప్పినా పలువురు తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తమ సమస్య లు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్ చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో మండల రెవెన్యూ యంత్రాంగం రిపోర్టు తప్పనిసరి కావడంతో ఇదే అదునుగా అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లా కేంద్రానికి దగ్గర్లోని మండలాల్లో బాహాటంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. డబ్బులిస్తేనే తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫైల్ కదులుతుందని.. లేకుంటే తప్పుగా ఎంట్రీ చేసి ఇబ్బందుల పాలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నా రు. ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో ధరణి దరఖాస్తుల పరిష్కారం వెంటనే పూర్తి అవుతున్నా తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం కావాలనే పెం డింగ్‌లో పెడుతున్నారని పేర్కొంటున్నా రు. కలెక్టర్‌కు అందజేసే రిపోర్టుకు ఎకరానికి రూ.10-20 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఫైల్ కనపడని పరిస్థితి పలు మండలాల్లో ఉన్నదని సమాచారం.