జిల్లావాసులను జ్వరాలు వెంటాడుతున్నాయి. వాతావరణ మార్పులతో పట్టణాలు, పల్లెల్లో బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. చికిత్స కోసం వస్తున్న వారితో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యశాఖలో ఇటీవల చేపట్టిన బదిలీల నేపథ్యంలో ముందస్తు చర్యలపై అధికారులు దృష్టి సారించలేకపోయారు. జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ మొక్కుబడిగానే సాగుతున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా డెంగీ కేసులు అధికారికంగా 119 నమోదైనప్పటికీ వాస్తవంగా ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నది.
– రంగారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)
దోమల నియంత్రణకు కార్యాచరణ ఏదీ ?
పల్లె, పట్ణణం అనే తేడాలేకుండా జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర బాధితులు లేని ఇల్లు ఉండడం లేదు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త, కలుపు మొక్కలు, నీటి నిల్వలపై దృష్టి పెట్టకపోవడంతో జిల్లాలో దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలకు పలుచోట్ల రహదారులు కోతకు గురై గుంతలు ఏర్పడి నీరు నిల్వడంతో దోమలు వృద్ధిచెంది పగలు, రాత్రి అనే తేడాలేకుండా కుడుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రగతి కార్యక్రమాలు చేపట్టి చాలాచోట్ల నీటి నిల్వలు, దోమల ఆవాస కేంద్రాలు లేకుండా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనబడడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య చర్యలు, దోమల నివారణ, ఇంటింటికీ చెత్త సేకరణ నిర్వహణ కార్యక్రమాలు నామమాత్రంగా సాగుతున్నాయి. సిబ్బంది చోద్యం చూడడమే తప్ప పారిశుధ్యం, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టడం లేదంటూ నిత్యం ప్రజల నుంచి అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
పడగ విప్పుతున్న డెంగీ..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ బారినపడి చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు తలనొప్పితో బాధపడుతూ దవాఖానలకు క్యూ కడుతున్నారు. మరికొందరు తీవ్ర జ్వరం, కఫంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతూ వైద్యశాలల్లో ఇన్పేషెంట్లుగా చేరి రోజుల తరబడి చికిత్సలు పొందుతున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో చాలామందికి డెంగీ లక్షణాలు ఉంటున్నాయి.
జిల్లాలోని 42 పీహెచ్సీ, యూపీహెచ్సీల పరిధిల్లో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 77 డెంగీ కేసులు నమోదు కాగా.. మున్సిపాలిటీల్లో 37 కేసులు, రూరల్లో 5 కేసులు కలిపి మొత్తం 119 కేసులు నమోదైనట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే డెంగీ బాధితులు ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలుస్తున్నది. జ్వరాలు విజృంభిస్తుండడంతో ఇదే అదనుగా ప్రైవేటు వైద్యశాలలు బాధితులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ప్లేట్లెట్లు తగ్గాయని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. చిన్నపాటి జ్వరంతో వెళ్లినా ఐసీయూలో ఉంచి టెస్ట్లు, చికిత్స పేరిట దవాఖాన సిబ్బంది వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొక్కుబడిగా జ్వర సర్వే..
సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కొద్ది రోజుల కింద రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగీలను నివారించడంతోపాటు అవసరమైన వారికి చికిత్స అందించడానికి ఈ సర్వే దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది. జిల్లాలో కొన్నిచోట్ల జ్వర సర్వే మొక్కుబడిగానే సాగుతున్నట్లు తెలుస్తున్నది.
ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, మల్టీ పర్పస్ హెల్త్ సూపరింటెండెంట్లతో బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ చాలాచోట్ల మొక్కుబడిగానే ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తున్నది. నిన్నమొన్నటి వరకు వైద్యారోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగడంతో జ్వర సర్వేపైన ఎవరూ అంతగా దృష్టి సారించలేకపోయారని ఆరోపణు వినిపిస్తున్నాయి. పల్లె, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో జ్వరాల సమస్య మరింత జఠిలంగా మారిందని జిల్లావాసులు పేర్కొంటున్నారు.