వికారాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశించే పేదలకు నిరాశే మిగులుతున్నది. రూ.కోట్లు వెచ్చిస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతున్నప్పటికీ పేదలకు మాత్రం వైద్యం అందని ద్రాక్షలా మారింది. సరైన సౌకర్యాలు లేకపోవడం.. సమయానికి వైద్యులు రాకపోవడం వంటి కారణాల వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ దవాఖానల విజిట్‌లో భాగంగా మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ జిల్లాలోని వైద్యశాలల్లోని పరిస్థితిని పరిశీలించింది. ఎక్కడిగొంగడి అక్కడే అన్నట్లు సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. సమయానికి వచ్చి రోగులకు వైద్యం అందించే డాక్టర్లు రాకపోవడం, ఎక్కడ చూసినా చెత్తాచెదారంలో దవాఖాన అంతా అస్తవ్యస్తంగా ఉండడం కనిపించింది. దీనికితోడు కనీస వసతులు లేక దవాఖానకు వచ్చిన రోగులు, వారివెంట వచ్చిన జనం అవస్థలు పడే బాధాకరమైన ఘటనలు కంటపడ్డాయి.
ప్రధానంగా జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆధీనంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానతోపాటు మాతాశిశు, ఏరియా వైద్యశాలల్లో పని చేస్తున్న అధికారులు, వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యావిధాన పరిషత్ ఆధీనంలో జిల్లాలో పని చేస్తున్న డీసీహెచ్ఎస్, ప్రభుత్వ ఏరియా వైద్యశాలల సూపరింటెండెంట్లు, వైద్యుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యావిధాన పరిషత్ ఆధీనంలో పని చేస్తున్న డీసీహెచ్ఎస్, సూపరింటెండెంట్లు మొదలుకొని వైద్యుల వరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
డీసీహెఎస్గా బాధ్యతలు నిర్వర్తించే ప్రదీప్‌కుమార్ తన బాధ్యతలను విస్మరించి పరిగిలోని ఓ ప్రైవేటు క్లినిక్‌లోనే సేవలందిస్తున్నారు. సంబంధిత సూపరింటెండెంట్లు, వైద్యులు కూడా ప్రైవేటు ప్రాక్టీస్‌కే పరిమితమవుతున్నారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన డీసీహెచ్ఎస్ రెండు రోజులకోసారి వికారాబాద్‌లోని సీహెచ్‌సీలో గంటపాటు నామమాత్రంగా విధులను నిర్వర్తిస్తుండడం బాధాకరం.
ప్రభుత్వ జిల్లా దవాఖానతోపాటు మాతాశిశు సంరక్షణాసుపత్రి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యుల్లో మెజార్టీ వైద్యులు సొంత క్లినిక్లకే పరిమితమై సర్కార్ దవాఖానకు వచ్చే పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుండడం స్పష్టంగా కనిపిస్తున్నది. వీరిని పర్యవేక్షించాల్సిన డీసీహెచ్‌ఎస్‌తోపాటు ప్రభుత్వ ఏరియా దవాఖానల సూపరింటెండెంట్లు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ సొంత క్లినిక్లకే ప్రాధాన్యమిస్తుండడం మరీ విడ్డూరం. దీంతో సర్కారు దవాఖానకు వచ్చే రోగులు చేసేదేమీలేక ప్రైవేటు దవాఖానలవైపు వెళ్తున్నారు.
డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వైద్యుల తీరు మారకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నది. ఇక మందుల విషయానికి వస్తే కొన్ని మందులు బయట తెచ్చుకోవాలని వైద్యులే సూచిస్తుండడం రోగులను ఆందోళన గురిచేస్తున్నది.
జిల్లా దవాఖానలో రోగుల అవస్థలు..
తాండూరులోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో వైద్యులు సమయానికి లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే పెద్ద దవాఖాన పరిస్థితులు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాసుపత్రిలో వైద్యులతోపాటు నర్సులు సరిపోను ఉన్నప్పటికీ విధులకు హాజరుకావడం లేదు.
రోజుకో వైద్యుడి చొప్పున వారానికి ఒకరు హాజరవుతూ చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్నారు. తాండూరులోని జిల్లాసుపత్రిలో రోజంతా వైద్య సేవలు అందాల్సి ఉండగా, మధ్యాహ్నం వరకే వైద్యులుండడం, తదనంతరం నర్సులతో కాలం వెళ్లదీస్తుండడం గమనార్హం. ఇక పారిశుధ్యం పరిస్థితి అయితే కొత్త రోగాలకు వెల్కం చెబుతున్నట్లుగా ఉన్నది. డ్రైనేజీ పైప్లైన్ల లికేజీలతో జిల్లాసుపత్రి పరిసరాల్లో మురుగు కంపుతోపాటు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
పరిగి నియోజకవర్గంలో..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరి పేదలకు నాణ్యమైన వైద్యం అందడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖానల్లో వైద్య సేవలు అద్భుతంగా అందాయి. నిధులు కేటాయింపులోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్యుల నియామకాలనూ చేపట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సర్కారు దవాఖానలను గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పేర్కొనవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఆగస్టు 3వ తేదీన పరిగి దవాఖానను 100 పడకల ఏరియా దవాఖానగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు సివిల్ వర్క్స్ కోసం రూ.26 కోట్లు మంజూరు చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దవాఖాన అప్‌గ్రేడేషన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్యాడర్ స్ట్రెంత్తోనే కొనసాగుతున్నది.
వైద్య విధాన పరిషత్ పరిధిలో కొనసాగుతున్న దవాఖానలో ప్రస్తుతం మొత్తం వైద్యులు, సిబ్బంది కలిపి 46 మంది పని చేస్తుండగా వారిలో 12 మంది డిప్యుటేషన్‌పై పని చేయడం జరుగుతున్నది. దవాఖానలో 11 మంది వైద్యులకుగాను ఒక డాక్టర్ ప్రసూతి సెలవులో ఉండగా పది మందికి కేవలం వైద్యశాల సూపరింటెండెంట్ ఒక్కరే వైద్య విధాన పరిషత్ నుంచి కొనసాగుతుండగా మిగతా వారంతా వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది ఉండడం గమనార్హం.
100 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయిస్తే వైద్యుల సంఖ్య చాలా పెరుగడంతోపాటు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఇక్కడ పని చేస్తారు. తద్వారా అన్ని విభాగాల వైద్యసేవలు ఇక్కడే అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రోజు ఓపీలో సుమారు 400 మందికిపైగా వైద్యసేవలు అందుతున్నాయి. వైద్యుల సంఖ్య పెరిగితే మరింత మందికి వైద్యం అందనున్నది.
ఇటీవలి కాలంలోనే సుమారు 10 మందికి పైగా డెంగీ రోగులకు వైద్యం అందించారు. నిత్యం పది మందికి పైగానే జ్వరాలు, డయేరియా తదితర వ్యాధులతో దవాఖానలో చేరుతున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. కొన్నింటిని బయట కొనాల్సి వస్తున్నదని రోగులు పేర్కొంటున్నారు. పేరుకే పెద్దాసుపత్రిగా పరిగి సర్కారు దవాఖాన ఉన్నదని చెప్పవచ్చు. పరిగి దవాఖానలో ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో చిన్నపాటి ఎక్స్‌రేకు సైతం ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తున్నదని రోగులు వాపోతున్నారు.
ఎక్స్‌రే, స్కానింగ్ కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లడం వల్ల రోగులపై ఆర్థిక భారం పడుతున్నది. ఇతర టెస్ట్‌లు దవాఖానలోనే చేపడుతుండగా ఎక్స్‌రే యంత్రం ఏర్పాటు అంశంపై ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు దవాఖాన చుట్టూ కలుపు మొక్కలు విస్తరించి ఉన్నాయి.
పాత దవాఖాన భవనం వెనకాల, కొత్త భవనం పక్కన కలుపు మొక్కలు విపరీతంగా పెరుగడంతో ఎక్కడ నుంచి పురుగుబూసి వస్తుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు. పరిగి నియోజకవర్గంలోని దోమ, కులకచర్ల, పూడూరు మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఇటీవల రోగుల సంఖ్య పెరిగింది. ప్రధానంగా సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులు వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులను పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంటున్నారు.