సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులతో బదిలీల బంతాట ఆడుతున్నది. ఒకటి రెండు నెలలు పని చేయకముందే బదిలీలు చేస్తూ అధికారులను పూర్తిస్థాయిలో పనిచేయనీయకుండా చేస్తూ.. తమకు పాలనపై ఏ మాత్రం అవగాహన లేదనే విషయాన్ని పదే పదే రుజువు చేస్త్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు ఏడు నెలల్లోనే నలుగురు అధికారులు బదిలీ కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక అధికారి ఒక కమిషనరేట్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలంటే కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. అలాంటిది రెండు మూడు నెలలకో అధికారిని మారుస్తూ.. వెళ్తే అధికారులు ఎలా పనిచేస్తారంటూ సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 13న రాచకొండ కమిషనర్‌గా ఉన్న డీఎస్ చౌహాన్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో సుధీర్‌బాబును నియమించారు. ఆ తరువాత రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో సాంకేతిక కారణాలతో ఆయనను బదిలీ చేసి.. ఆ స్థానంలో తరుణ్ జోషిని నియమించారు. నాలుగోసారి తరుణ్జోషిని అక్కడి నుంచి బదిలీ చేసి తిరిగి సుధీర్‌బాబును నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్ ఐజీగా ఉన్న సుధీర్‌బాబు అక్కడ పట్టు సాధిస్తుండగా, ఇక్కడ తరుణ్‌జోషి పట్టు సాధిస్తున్నారు. ఇంతలోనే ఈ బదిలీ జరగడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈస్ట్‌జోన్ డీసీపీగా ఉన్న గిరిధర్‌ను మూడు నెలల్లోనే వనపర్తి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఆయనను మొదట ఎస్వోటీ మల్కాజిగిరి డీసీపీ నుంచి ఈస్ట్‌జోన్‌కు బదిలీ చేశారు. ఆ తరువాత ఇప్పుడు మరోసారి బదిలీ చేశారు. మూడు నెలల కిందట సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని మెదక్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో చంద్రమోహన్ నియమించారు. రాచకొండ ఎస్బీ డీసీపీగా ఉన్న బాలస్వామిని మెదక్‌కు.. తాజాగా, ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేసింది. కార్ హెడ్‌క్వార్టర్స్ అదనపు సీపీ సత్యనారాయణ మల్టీజోన్-2 ఐజీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో డీసీపీ రక్షిత.కె మూర్తిని నియమించారు.