వికారాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సబ్సిడీ విత్తనాలను స్వాహా చేసిన ఘటనపై విచారణ నత్తనడకన సాగుతున్నది. సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలో రైతులకు సబ్సిడీపై అందించాల్సిన రూ.60 లక్షల విలువైన సబ్సిడీ విత్తనాలను వ్యవసాయాధికారులు స్వాహా చేసి నెల రోజులవుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారనే దానిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందజేస్తుంది.
పంపిణీ చేయాల్సింది పోయి బ్లాక్ మార్కెట్కు తరలించి వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విత్తనాల స్వాహా విషయంలో ఏఈవో, నియోజకవర్గ, జిల్లాస్థాయి అధికారుల వరకు హస్తమున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ విత్తనాల స్వాహాపై విచారణకు కలెక్టర్ ఆదేశించి, వారం, పది రోజులు అవుతున్నా.. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏటా సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం రైతులకు అందిస్తున్నా వ్యవసాయాధికారులు మాత్రం రైతులకు అందజేస్తున్నట్టు రికార్డు చూపించి దారి మళ్లిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
చిరు, పప్పు ధాన్యాల పంటలను ప్రోత్సహించడంతోపాటు రైతులకు విత్తనాలు కొనే భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీపై ప్రభుత్వం అందజేసిన విత్తనాలను జిల్లా లో పక్కదారి పట్టించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, దుద్యాల, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలతోపాటు తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం, వికారాబాద్ నియోజకవర్గంలోని బంట్వారం మండలం, పరిగి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సబ్సిడీపై యాసంగిలో వేరుశనగ విత్తనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత మండలాలకు రూ.60 లక్షల విలువైన 900 క్వింటాళ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, ఏ ఒక్క రైతుకూ సబ్సిడీ విత్తనాలు అందించ కుండానే వ్యవసాయాధికారులు బ్లాక్ మార్కెట్కు తరలించి అందినకాడికి దోచుకున్నారు. సబ్సిడీ విత్తనాలు ప్రభుత్వం నుంచి వచ్చాయనే కనీస సమాచారం కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు లేకపోవడం గమనార్హం.
అయితే రెండు పథకాల కింది 45 శాతం సబ్సిడీతోపాటు వంద శాతం సబ్సిడీ కింద జిల్లాకు వేరుశనగ విత్తనాలు రాగా, ఆయా మండలాల ఏఈవో, ఏవోలు అందజేసినట్టు చూపిస్తున్నా ఏ ఒక్క రైతుకూ సబ్సిడీ విత్తనాలు అందకపోవడం గమనార్హం. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట మండలాల్లో సబ్సిడీ విత్తనాలను దారి మళ్లించి అక్రమార్జనకు పాల్పడ్డారని ఆయా మండలాల వ్యవసాయాధికారులపై ప్రాథమిక విచారణలో తేలినా చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో సబ్సిడీ విత్తనాలను అందజేసినట్టు చూపిస్తున్న జాబితాలో పేరున్న ఒక్క రైతుకూ కిలో వేరుశనగ విత్తనాలు కూడా అందనట్టు ప్రాథమిక విచారణలో బయటపడినట్టు సమాచారం. రైతులకు అందాల్సిన సబ్సిడీ విత్తనాలను స్వాహా చేసిన వ్యవసాయాధికారులపై చర్యలు తీసుకుంటారా లేదంటే విచారణ పేరిట పక్కన పెడతారనేది త్వరలో తేలనున్నది.