వికారాబాద్, డిసెంబర్ 13 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు తిష్ట వేశాయి. సరిపడా గదుల్లేక, మౌలిక వసతుల్లేక బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. ఇక్కడ 450 మంది విద్యార్థులుండగా.. 23 గదులకుగా నూ కేవలం 6 గదులే ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మీడియాల్లో విద్యబోధన జరుగుతుండగా.. 20 మంది లెక్చరర్లు ఉన్నారు. ఇంటర్ తెలుగు మీడియం ప్రథమ, ద్వితీయ తరగతుల్లో కలిసి 238 మంది విద్యార్థులు, ఆంగ్ల మీడియంలో 118 మంది, ఉర్దూ మీడియంలో 94 మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలుగు, ఆంగ్ల మీడియాల్లో ఎంపీసీ, బైపీ సీ, సీఈసీ, హెచ్ఈసీ, ఉర్దూ మీడియంలో బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు కొనసాగుతున్నాయి.
గత పదేండ్ల కిందట వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆరు గదులను నిర్మించగా.. క్రమం గా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో దాని పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మరో భవన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 2.20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో విద్యార్థుల సమస్యలు తీరుతాయని అందరూ భావించారు. రూ.కోటితో భవనం స్లాబ్ వరకు పనులు చేరుకొని అక్కడే ఆగిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చి.. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రావడంతో మిగిలిన రూ 1.20 కోట్ల నిధులు విడుదల కాకపోవడంతో పనులు అర్ధాంతరంగా మ ధ్యలోనే నిలిచిపోయాయి. ఆ నిధులను విడుదల చేసి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కళాశాల ప్రిన్సిపాల్ కలిసి విన్నవించారు. తమ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు స్పీకర్‌కు వినతి పత్రాన్ని కూడా అందించారు.
ఆరు బయట చదువులు
భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు చదువుకునేందుకు ఆరు గదులు సరిపోక..వారు ఆరు బయట, మెట్లు, స్లాబ్ కింద కూర్చుని చదువుకుంటున్నారు. ఉర్దూ మీడియంలో అయితే ఒకే గదిలో రెండు తరగతులను నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్థులకు ల్యాబ్‌లు లేకపోవడంతో పరిశోధన పరికరాలను బీరువాల్లో పెట్టారు. సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలల్లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కళాశాలకు స్కావెంజర్ లేకపోవడంతో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తన సొంత డబ్బుతో మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారు. సరిపడా ఫర్నిచర్ లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే కూర్చుంటున్నారు. విద్యాశాఖ కమిషనర్ స్పందించి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయించి మిగిలిన పనులను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ప్రయోగశాలను అందుబాటులోకి తేవాలి
ఇక్కడ బోధన బాగున్నది. కానీ, ప్రయోగశాల లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థులకు ప్రయోగ శాల ఎంతో దోహదపడుతుంది. అధికారులు స్పందించి ప్రయోగ శాలను అందుబాటులోకి తీసుకురావాలి.
-సాజిత్ ఖాన్, బైపీసీ, ఇంగ్లిష్ మీడియం, రెండో ఏడాది
గదుల్లేక ఆరు బయటే..
కళాశాలలో సరిపడా గదుల్లేక మెట్లు, ఆరుబయట, వరండాలో కూర్చుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఫర్నిచర్ కూడా లేకపోవడంతో నేలపైనే కూర్చొ వాల్సి వస్తున్నది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరగా భవన నిర్మాణ పనులను పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలి.
-అక్ష, సీఈసీ, తెలుగు మీడియం, రెండో ఏడాది
మెరుగైన విద్య అందిస్తున్నాం..
ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ.1.20 కోట్ల నిధులను విడు దల చేసి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలి. కాలేజీలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి మెరుగైన విద్య అందిస్తున్నాం. ఇప్పటికే ప్రతినెలా యూనిట్ టెస్టులు, మూడు నెలలు, ఆరు నెలలు, ఫ్రీ ఫైనల్ తదితర పరీక్షలను నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం.
-వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల