మంచాల, డిసెంబర్ 30 : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టీఎల్ఎం ద్వారానే విద్యార్థులకు బోధించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని నోముల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలిమెట్టు టీఎల్ఎం మేళా కార్యక్రమాన్ని ఎంపీపీ జాటోతు నర్మదతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎం సామగ్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకే ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.
విద్యార్థులకు భాషా పరిజ్ఞానం, రాయడం, చదవడంతో పాటు గణితంలో పట్టు సాధించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ఉపాధ్యాయులు ఏ గ్రేడ్లో ఉండేటట్లు వారిని తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ నిత్య, సర్పంచ్ బాల్రాజ్, ఎంపీటీసీ జయానంద్, ఇన్చార్జి ఎంఈవో వెంకట్రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
నందిగామ : ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి బోధన, అభ్యాసన సామగ్రి మేళాను ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధన సామగ్రి తయారు చేశారని, సామాగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంక, ఎంఈవో కృష్ణారెడ్డి, విద్య కమిటీ చైర్మన్ జంగారి రాములు, హెచ్ఎం దినేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.