విద్యార్థులు… ఫోన్ ఉంటే చాలు లోకాన్నే మరిచిపోతున్నారు. చదువును నిర్లక్ష్యం చేస్తూ ఫోన్లో వీడియోలు, స్నేహితులతో చాటింగ్‌లు చేస్తూ కాలాన్ని వృథా చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 7వ తరగతి వరకు ప్రతి పాఠశాలలో రీడింగ్ కార్నర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతగా 148 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసింది. తరగతి గదిలో 250 రకాల పుస్తకాలను అమర్చేందుకు సెల్ప్లనూ ఏర్పాటు చేస్తున్నారు.
విద్యార్థుల్లో సత్ప్రవర్తన, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ సైతం ఇచ్చారు. క్లాస్ రూంల్లోనే పుస్తక పఠనం చేసేందుకు ఒక పీరియడ్‌ను కేటాయించనున్నారు. ఒక్క పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమన్న భావన కల్పించి విద్యార్థుల్లో మార్పును తీసుకురానున్నారు. మరో వారం రోజుల్లో రీడింగ్ కార్నర్స్‌ను ప్రారంభించేందుకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
ఇబ్రహీంపట్నం, జనవరి 16 : విద్యార్థులు పుస్తకాలకు దూరమవుతూ..ఫోన్లకు దగ్గరవుతున్న తరుణంలో వారిలో మార్పు తీసుకురావటం కోసం ప్రభుత్వం పాఠశాల స్థాయిలో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. పాఠశాలస్థాయినుంచే విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటు కావాలనే ఉద్దేశంతోనే క్లాస్‌రూంల తరహాలోనే పుస్తకం పఠనం కూడా ఒక్క పీరియడ్‌గా ఏర్పాటు చేయటం కోసం రీడింగ్రూంలను ఏర్పాటు చేస్తున్నది. ఒక్క మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానమనే భావన విద్యార్థుల్లో కలగజేయాలనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రంగారెడ్డిజిల్లాలోని 148 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటిదశలో రీడింగ్ కార్నర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో 3000లకు పై గాప్రభుత్వ పాఠశాలలుండగా, మొదటి విడుతలో 148పాఠశాలలను ఎంపికచేశారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రీడింగ్ కార్నర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రీడింగ్ కార్నర్‌ను పాఠశాలల్లోని ఒక తరగతి గదిలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం పాఠశాలలోని తరగతి గదిలో పుస్తకాలను అమర్చటం కోసం సెల్ఫ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రీడింగ్ కార్నర్ల నిర్వహణ బాధ్యతను అదే పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయునికి కేటాయించారు. కేటాయించిన ఉపాధ్యాయుడికి ఇప్పటికే శిక్షణకూడా ఇచ్చారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు విద్యార్థులను రీడింగ్ కార్నర్స్‌కు రప్పించి పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించే విధంగా వ్యవహరిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న రీడింగ్ కార్నర్స్‌లో 250రకాల పుస్తకాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో దేశభక్తిని, నైతిక విలువలను పెంపొందించుకోవటం, విలువలతో కూడిన ప్రవర్తన అలవర్చుకోవటం, సమాజంపట్ల గౌరవం పెంపొందించే విధంగా ఉండటంతో పాటు జనరల్ నాలెడ్జ్‌ను పెంపొందించే పుస్తకాలు అందులో అందుబాటులో ఉంటాయి. విద్యార్థి దశనుంచే పుస్తకాలు చదివితే విద్యార్థి సన్మార్గంలో పయనించే అవకాశాలుండే విధంగా పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నారు. రీడింగ్ కార్నర్లు విజ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలుగా తీర్చిదిద్దటం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం అవసరమైన పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చింది. ఈ పుస్తకాలు మరో రెండు, మూడు రోజుల్లో జిల్లా విద్యాశాఖకు అందుబాటులోకి రానున్నాయి. మరో వారంరోజుల్లో వీటిని ప్రారంభించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.
వ్రస్తుతం విద్యార్థులు ఫోన్లకు దగ్గరవుతూ..పుస్తకాలకు దూరమవుతున్నారు. దీంతో పుస్తకాలు చదవటానికి క్రమంగా దూరమవతున్నారు. మరోవైపు గ్రంథాలయాల్లో ఉన్న విలువైన పుస్తకాలు చదవటానికి కూడా ఆసక్తి చూపటంలేదు. దీంతో విద్యార్థిస్థాయి నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకునే విధంగా ప్రతి పాఠశాలలో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి విద్యార్థులు ఖచ్చితంగా రీడింగ్ కార్నర్‌కు వెళ్లి పుస్తక పఠనం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మొదటి విడుతలో 148 పాఠశాలల్లో రీడింగ్ కార్నర్ల కోసం ఎంపికచేశారు. దశల వారీగా మిగతా పాఠశాలల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
విద్యార్థిదశ నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది, ఇందుకోసం జిల్లాలోని 148 పాఠశాలలను మొదటి దశలో ఎంపికచేశారు. రీడింగ్ కార్నర్ల నిర్వాహణను సంబంధిత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించాము. రీడింగ్ కార్నర్ల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. త్వరలోనే వీటిని ప్రారంభిస్తాం.
– డీఈవో సుశీందర్‌రావు, రంగారెడ్డిజిల్లా
పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుంది. విద్యార్థులు క్రమంగా పుస్తకాలు చదవటానికి దూరమవుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో రీడింగ్ రూంలు ఏర్పాటు చేయటం ఎంతో శుభపరిణామం. ఒక మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానమని విద్యార్థులు మంచి పుస్తకాలు చదివి దేశభక్తిని పెంపొందించుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.
– వర్కాల పరమేశ్, ప్రధానోపాధ్యాయుడు..