వికారాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా రెండో జత యూనిఫాం విద్యార్థులకు అందలేదు. ఒక జత యూనిఫాంను అందజేసిన సర్కారు రెండో జత యూనిఫాంను అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్లు ప్రారంభమైన వారం రోజులకే రెండు జతల యూనిఫాం, పుస్తకాలను అందజేయగా.. ఇప్పుడు యూనిఫాం కోసం పేద విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క రోజు యూనిఫాం వేసుకొస్తే మరుసటి రోజు యూనిఫాం లేకుండానే రావాల్సి వస్తున్నది. ఒక్క జత యూనిఫాం అందజేసి తప్పనిసరిగా యూనిఫాం వేసుకొని రావాలని ఉపాధ్యాయులు సూచిస్తుండటంతో విద్యార్థులు ఇంటికెళ్లిన తర్వాత మొదటగా యూనిఫాం ఉతకడమే పనిగా పెట్టుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
నిబంధనల మేరకు పాఠశాలలు ప్రారంభించే నాటికి విద్యార్థులకు పుస్తకాలతోపాటు యూనిఫాం అందజేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్కూళ్లు ప్రారంభమైన పదిహేను రోజులకు ఒక జత యూనిఫాం అందజేసిన విద్యాశాఖ అధికారులు, రెండో జత యూనిఫాంకు సంబంధించి ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులకు క్లాత్ అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 80,232 మంది విద్యార్థులకు ఒక జత యూనిఫాంను అందజేశామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా మంది విద్యార్థులు స్కూల్ యూనిఫాం లేకుండానే వస్తున్నారు.
రెండో జత యూనిఫాంకు సంబంధించి జిల్లాకు వస్త్రం వచ్చినప్పటికీ విద్యార్థులకు యూనిఫాంను అందజేసేందుకు మరో నెల సమయం పట్టే అవకాశమున్నది. అయితే విద్యాశాఖ అధికారులు మరో వారం, పది రోజుల్లో రెండో జత యూనిఫాంను విద్యార్థులకు అందజేస్తామని చెప్పకొస్తున్నారు. ప్రస్తుతం కేవలం 20 శాతం మేరనే రెండో జత యూనిఫాం కుట్టడం పూర్తైన దృష్ట్యా మరో నెలకుపైగా సమయం పట్టే అవకాశముందని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు ఒకే జత యూనిఫాం అందుకున్న విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత ఏరోజుకారోజు ఉతికితేనే తెల్లారి పాఠశాలలకు యూనిఫాంతో వెళ్లే పరిస్థితులతో అవస్థలు పడుతున్నారు.
విద్యార్థులకు యూనిఫాం అందజేసేందుకు యూనిఫాంను కుట్టించే బాధ్యతను సర్కారు మహిళా సమాఖ్యలకు అప్పగించింది. ఒక్క జత యూనిఫాం కుట్టేందుకు మహిళా సమాఖ్య సభ్యులకు రూ.70 మాత్రమే అందజేస్తున్నారు. సమాఖ్యల్లోని సభ్యులకు టైలరింగ్ వస్తే వాళ్లే కుడుతున్నారు, లేకపోతే స్థానిక టైలర్లతో యూనిఫాంను కుట్టిస్తున్నారు. ఒక్క జత యూనిఫాం కుడితే ప్రభుత్వం ఇస్తున్న రూ.75 సరిపోవడంలేదనే భావనతో టైలర్లు యూనిఫాం కుట్టేందుకు ముందుకు రావడంలేదనే అభిప్రాయమున్నది. దీంతో యూనిఫాం కుట్టే ప్రక్రియ ఆలస్యమవుతున్నది.
విద్యార్థులకు రెండో జత యూనిఫాంను వీలైనంత త్వరితగతిన అందజేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే రెండో జత యూనిఫాంకు సంబంధించి క్లాత్ వచ్చింది. 20 శాతం మేర యూనిఫాంను కుట్టే ప్రక్రియ కూడా పూర్తయింది. మరో వారం, పది రోజుల్లో విద్యార్థులందరికీ రెండో జత యూనిఫాంను అందజేసేందుకు చర్యలు చేపట్టాం.
– డీఈవో రేణుకాదేవి