మియాపూర్, ఏప్రిల్ 2 : ఫుట్బాల్ ఆడుకునేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుతున్నాడని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన విశ్వవిద్యాలయ భూములను విక్రయిస్తే తామెక్కడ చదువుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా విశ్వ విద్యాలయంలోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన చిన్నారి విద్యార్థులు మద్దతు పలికారు. ఈ మేరకు ప్లకార్డులు చేతపట్టి విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థినిలు జాహ్నవి ,యశస్వి మాట్లాడుతూ ఫుట్బాల్ ఆట కోసం ఇక్కడికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి భూములని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని అలా చేస్తే తాము ఎక్కడ చదువుకోవాలని ప్రశ్నించారు. ఉన్నత విద్య అభ్యసించే వేలాది విద్యార్థులు రోడ్డున పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాల భూములు వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన సరైంది కాదని వేలాదిమంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చే విద్యాలయాలపై ప్రభుత్వం ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవద్దని వారు కోరారు.
తక్షణమే సెంట్రల్ వర్సిటీ భూముల విక్రయం ఆలోచనను మానుకోవాలని విశ్వవిద్యాలయంతో పాటు అందులో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ సంస్థలను రోడ్డున పడేయ వద్దని విద్యార్థినిలు జాహ్నవి యశస్వి, కోరారు. యూనివర్సిటీకి చెందిన అత్యున్నత అధికారులు దీనిపై స్పందించి వేలాదిమంది విద్యార్థిల భవిష్యత్తును అంధకారంలోకి నెట్ట వద్దని వారు అభ్యర్థించారు. యూనివర్సిటీలో ఇప్పటికే వేలాది చెట్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ వన్యప్రాణులకు తీవ్రమైన హాని కలిగిస్తూ గూడు లేకుండా చేస్తున్నారని, వాటి అరుపులు వింటే ఎంతో బాధ కలుగుతోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పక్షి నెమలి రోదనకు సీఎం రేవంత్ రెడ్డి కారణం అన్నారు.