ఇబ్రహీంపట్నం, మే 10 : అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది. తోటి విద్యార్థులు, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్ణవెల్లి గ్రామానికి చెందిన అల్లూరి కిట్టమ్మ, శశిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భావన (22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో ఉంటూ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
అయితే, శనివారం ఉదయం 10 గంటల సమయంలో వసతి గృహంలో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన వసతిగృహం వార్డెన్ తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీరాజు, సీఐ జగదీశ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. భావన తల్లిదండ్రులు హైదరాబాద్ నగరంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విద్యార్థి భావన మృతిపై తోటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించడం సరైన పద్ధతి కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, ప్రణయ్ అన్నారు. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో కళాశాల ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యంగా గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని, ఈ విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు.
ఆందోళనకారులు కళాశాలలోకి ప్రవేశించకుండా కళాశాల సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆందోళన కారులు కళాశాల గేట్లపై నుంచి కళాశాలలోకి చొరబడ్డారు. విద్యార్థిని మృతి పట్ల సరైన సమాచారం లేకుండానే కళాశాల యాజమాన్యం, పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కళాశాల యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.