Street Dogs | బతుకుదెరువు కోసం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలస వచ్చి కోకాపేటలోని సబితానగర్‌లో ఉంటున్న రాజు, అంజమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలీనాలీ చేసుకుంటూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్ద కుమారుడు భరత్(7) పుట్టుక నుంచే మానసిక అంగవైకల్యంతో బాధపడుతూ..మంచానికే పరిమితమయ్యాడు. కాగా, శుక్రవారం ఉదయం ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న భరత్‌పై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఇంటి పక్కన వంట చేసుకుంటున్న తల్లి అంజమ్మ పిల్లాడి అరుపులు విని వచ్చేసరికి మూడు కుక్కలు బాలుడి మర్మాంగాలను కొరికేశాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడిని నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడి పరిస్థితిని గమనించిన వైద్యులు..వెంటనే ఆపరేషన్ చేశారు. రెండ్రోజులు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు. ఇదిలా ఉండగా, రొక్కాడితే డొక్కాడని.. జీవితాలు మావని.. వీధి కుక్కల దాడితో మరింత దయనీయ స్థితికి చేరుకున్నామని బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆపరేషన్ కోసం వైద్యులు రూ. 30వేలు అడుగుతున్నారని, తమ వద్ద అంత డబ్బులు లేవని, సాయం చేయాలంటూ.. ఆస్పత్రికి వచ్చిపోయే వారిని వేడుకోవడం చూపరులకు కంటతడి పెట్టించింది. అయితే ఆస్పత్రి వైద్యులు సైతం పెద్ద మనస్సు చాటుకున్నారు.
ముందస్తుగా ఆపరేషన్ పూర్తిచేసి.. బాలుడి ప్రాణానికి ప్రమాదం జరుగకుండా చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే వారం రోజుల కిందట సబితానగర్లోనే తన కుమారుడిపై అవే కుక్కలు దాడికి పాల్పడడంతో చికిత్స చేయిస్తున్నట్లు భరత్ పెద్దనాన్న నాగేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల వీరంగంపై స్థానిక నార్సింగి మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని వాపోయారు.
వీధి కుక్కలు క్రూర మృగాలుగా మారుతున్నాయి. ఒంటరిగా మనిషి కనిపిస్తే చాలు..వెంబడించి దాడికి తెగబడుతున్నాయి. ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై విరుచుకుపడుతున్నాయి. వారి ప్రాణాలను తీస్తున్నాయి. వరుసగా జరుగుతున్న కుక్కల స్వైరవిహారంతో నగరవాసులు ఇప్పటికే బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ ఇంట్లోకి చొరబడి మానసిక ఆరోగ్య స్థితి బాగోలేని బాలుడిపై కుక్కలు పైశాచికంగా దాడి చేసి..అతడి మర్మాంగాలను కొరికేశాయి. కలవరానికి గురిచేసిన ఈ ఘటన కోకాపేట సబితానగర్‌లో చోటుచేసుకున్నది.
-మణికొండ/ఇబ్రహీంపట్నంరూరల్/తెలుగు యూనివర్సిటీ ఆగస్టు 9
ఇబ్రహీంపట్నంరూరల్/తెలుగు యూనివర్సిటీ ఆగస్టు 9 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయపోల్ గ్రామంలో కుక్కల దాడిలో గాయపడిన ఉడుతల శివకుమార్ మాధురి దంపతుల కుమారుడు కియాన్ష్గౌడ్ (4) శుక్రవారం చికిత్స పొందుతూ చనిపోయాడు. నెలరోజుల కిందట కుక్కల దాడిలో బాలుడికి కుడివైపు చెంపపై బలంగా గాయమైంది. వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో బాబును గురువారం రాత్రి నిలోఫర్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కియాన్ష్ చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.