రంగారెడ్డి, డిసెంబరు 12 (నమస్తే తెలంగాణ): కూరగాయల సాగులో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. అధిక గ్రామాలు కూరగాయల పంటలను సాగు చేస్తూ హైదరాబాద్‌లోని పలు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. ఈ యాసంగి సాగుకు ఉద్యానవన శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో 9,195 ఎకరాల్లో కూరగాయల సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేసింది. ఉద్యాన పంటల సాగుకు రాయితీ పథకాలతో ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహాన్నిస్తున్నది. వేరే పంటల సాగు కన్నా కూరగాయల సాగు మేలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకుగాను శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ నూతన సాగు పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, మెళకువలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఏటా మూడు లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల దిగుబడి అవుతున్నది.
‘రంగారెడ్డి జిల్లాలో యాసంగి సాగుకు ఉద్యానవన శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. 9,195 ఎకరాల్లో రైతులు కూరగాయల సాగును చేపట్టేలా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కూరగాయల సాగులో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్‌లోని పలు మార్కెట్లకు సైతం జిల్లా నుంచే కూరగాయలు ఎగుమతి అవుతున్నాయి. కొన్నేండ్లుగా జిల్లాలో క్రమక్రమంగా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో జిల్లా గత వైభవాన్ని చాటుకునేలా ఉద్యానవన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు కూరగాయల సాగులో రైతులకు మెలకువలను సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.’
కూరగాయల సాగే జీవనాధారం..
జిల్లాలోని అనేక పల్లెలు కూరగాయల సాగుకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. అనేక దశాబ్దాలుగా రైతు కుటుంబాలు కూరగాయల సాగునే జీవనాధారం చేసుకుని బతుకుతున్నాయి. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ తదితర ప్రాంతాలు క్యారెట్ సాగుకు పేరుగాంచాయి. అలాగే ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్ ప్రాంతాలు ఆకుకూరలకు, షాద్‌నగర్ పచ్చిమిర్చి సాగుకు ప్రఖ్యాతి గాంచాయి. జిల్లావ్యాప్తంగా సాగు చేస్తున్న కూరగాయల సాగుతో ప్రతియేటా 3లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల ఉత్పత్తి జరుగుతున్నది. వీటిలో 30 శాతం జిల్లా అవసరాలకు పోగా.. మిగతా 70శాతం కూరగాయలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు, హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టూరా ఉన్న ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. పాలకూర, చుక్కకూర, పొన్నగంటి కూర, మెంతికూర, ఎర్ర గోంగూర వంటి అనేక రకరకాల ఆకు కూరలతోపాటు కూరగాయలను పండిస్తూ జిల్లా రైతాంగం ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నది.
హైదరాబాద్‌కు చెంతనే ఉన్న రంగారెడ్డి జిల్లా గత పదేండ్లకాలంలో నలు వైపులా శరవేగంగా విస్తరిస్తుండడం కూరగాయల సాగుపై ప్రభావం పడింది. పెద్ద ఎత్తున పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటవుతుండడం.. వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండడంతో కూరగాయల సాగు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో కూరగాయల సాగును ప్రోత్సహించి గత వైభవాన్ని జిల్లా చాటేలా ఉద్యానవన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాలం ఏదైనా.. ఫుల్ డిమాండ్
ఏ కాలం అయినా..కూరగాయల కొరత మాత్రం సర్వసాధారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటున్నది. ఇక వచ్చేది వేసవి కాలం. కూరగాయలు దొరకడం మరీ కష్టం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత యాసంగిలో జిల్లా రైతాంగం కూరగాయల పంటలనే సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.60 ధర పలుకుతున్నది. ఇతర పంటలతో పోలిస్తే కూరగాయల సాగుతో మూడింతల లాభాన్ని రైతులు పొందవచ్చు. గతంలో సరైన నీటి వనరులు లేక రైతులు కూరగాయల సాగుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడా ఇబ్బంది లేదు. పుష్కలమైన సాగునీరు అందుబాటులో ఉన్నది. కూరగాయలను విక్రయించుకునేందుకు రవాణా వ్యవస్థ సైతం మెరుగుపడింది. ఒక ఎకరం వరి సాగుకు ఉపయోగించే నీటితో 4 ఎకరాల్లో కూరగాయలను సాగు చేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చేది వేసవి కాలం కావడంతో మంచి ధర పలికే అవకాశం ఉన్నందున యాసంగిలో అధిక విస్తీర్ణంలో కూరగాయలు, ఆకు కూరలను సాగు చేయాలని అధికారులు కోరుతున్నారు.
సర్కారు ప్రోత్సాహం..
ఉద్యాన పంటల సాగుకు రాయితీ పథకాలతో ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తోంది. 2014 నుంచి 2022-23 సంవత్సరం వరకు జిల్లాలో సాగు చేసిన పండ్లతోటలు, కూరగాయల సాగుకు రూ.2.08కోట్లు, నీటి కుంటల నిర్మాణానికి రూ.1.69కోట్లు, మల్చింగ్‌కు రూ.28లక్షలు, శీతల గదుల కోసం రూ.8.08కోట్ల రాయితీ పథకాలను రైతులకు ప్రభుత్వం అందించింది. బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. గత పదేళ్లకాలంలో బిందు సేద్యం ద్వారా రూ.73కోట్లు, తుంపర సేద్యం ద్వారా రూ.56లక్షల రాయితీతో రైతులు లబ్దిపొందారు. 199 ఎకరాల్లో పాలీ హౌస్‌లను, 5 ఎకరాల్లో నెట్హౌస్లను ఏర్పాటు చేసింది. ఇందుకు గాను రూ.69.93కోట్లను వెచ్చించగా, 220 మంది రైతులు లబ్దిపొందారు. జిల్లాలో 162 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతుండగా..రేరింగ్ షెడ్డు నిర్మాణానికి గతంలో ఇచ్చిన రూ.లక్షను తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షలకు పెంచింది. జిల్లాలో ఇప్పటివరకు 90 రేరింగ్ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.
యాసంగి ప్రణాళిక ఇలా..
పంట సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)