వికారాబాద్, మార్చి 27 : ధాన్యం కొనుగోలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర కార్యక్రమాల వల్ల స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుండి సెర్ఫ్ సీఈఓ దివ్య తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డ్డీఓ,సెర్ప్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఐకేపీ ద్వారా రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరింత పెంచాలని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఐకేపీ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న కమిషన్ ను సమీక్షించాలని సూచించారు. గన్ని బ్యాగుల సమీకరణ చేయాలని , భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో మహిళ సంఘాల ద్వారా గోడౌన్లతో పాటు, రైస్ మిల్లుల ఏర్పాటు వంటివి ఆలోచిస్తున్నందున ధాన్యం కొనుగోలులో స్వయం సహాయక మహిళా సంఘాలు చురుకుగా పాల్గొనేలా చూడాలన్నారు.
ఒక కుటుంబంలో ఒకరికే వృద్ధాప్య పింఛన్ ఉండేలా చూడడం, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం వంటివి ఎంపీడీవోల ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలు ద్వారా పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్‌తో పాటు,వారి ఆదాయ మార్గాలు పెంచుకునే విధంగా ప్రైవేట్ ఆర్డర్లపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ప్రతి జిల్లా , నియోజక వర్గ, మండల కేంద్రాలలో పెట్రోల్ బంక్‌లను నిర్వహించాలని ఆలోచిస్తున్నందున జిల్లా స్థాయిలో పెట్రోల్ బంక్ ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించినట్టే, మండల, నియోజకవర్గాల స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. సెర్ప్ సీఈవో దివ్య వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 128 సెంటర్లలో ఐకేపీ కేంద్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్ 34 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గన్ని బ్యాగులు సరిపడ అందుబాటులో ఉన్నాయని అన్నారు. దివ్యాంగులను నిర్ధారించేందుకు అవసరమైన పరికరాలు ఆసుపత్రిలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్ ,సుదీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, సరోజ, మోహన్ బాబు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.