అమలుకు నోచుకోని హామీలిస్తూ అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ అయోమయానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదిలోనే గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కనీస మౌలిక వసతులను కల్పించడంలోనూ సర్కార్ విఫలమైంది. గతేడాది కాలంగా ప్రభుత్వ గురుకులాల నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతోపాటు పర్యవేక్షణ లోపించింది. దీంతో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ అంతటా వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగడం, రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాత్రికిరాత్రే పెండింగ్లో ఉన్న డైట్ చార్జీలను విడుదల చేయడంతోపాటు డైట్ చార్జీలను పెంచుతున్నామంటూ హంగుఆర్భాటాలు చేస్తూ ప్రచారం చేసుకున్నది. తీరా పెంచిన చార్జీలను చెల్లించకుండా పాత మెనూ డైట్ బిల్లుల ప్రకారం కొత్త మెనూ డైట్ అమలు చేయాలని చెబుతుండడం గమనార్హం.
– వికారాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ)
నాడు కళకళ.. నేడు వెలవెల..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలలు సకల సౌకర్యాలతో కళకళలాడాయి. 200 గురుకులాలను వెయ్యి పాఠశాలలకు పెంచింది. సన్నబియ్యం, రుచికరమైన వంటకాలతో పౌష్టికాహారాన్ని అందించింది. కార్పొరేట్ స్థాయిలో విద్యనందించడంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం విద్యార్థులకు పురుగుల అన్నం దిక్కయ్యింది. తాగునీటి వసతి లేకపోవడం, అస్తవ్యస్తంగా మారిన బాత్ రూంలతో విద్యార్థులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది. ఏడాది కాలంగా నిధులను విడుదల చేయకుండా గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఆర్భాటానికే హాస్టళ్లలో కొత్త మెనూ..
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త మెనూ కేవలం ఆర్భాటానికేనని స్పష్టమవుతున్నది. డైట్ చార్జీలు పెంచుతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి చిలుకూరు గురుకుల పాఠశాలలో కొత్త మెనూను ప్రారంభించి నెల రోజులు గడిచినా అమలుకు మాత్రం నోచుకోలేదు. చార్జీలు పెంచాం.. కొత్త మెనూ అమలు చేస్తామని ప్రచారానికి రూ.కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఇంకా పాత మెనూ ప్రకారమే డైట్ చార్జీలను చెల్లిస్తుండడం విడ్డూరంగా ఉన్నది. పాత మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.44లు ఖర్చు చేస్తుండగా, కొత్త మెనూ ప్రకారం రూ.88లను ఖర్చు చేయాల్సి ఉన్నది. కొత్త మెనూను అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. డైట్ చార్జీలను పెంచకుండానే చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొత్త మెనూను అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో హాస్టల్ వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. పాత బిల్లులతో కొత్త మెనూ డైట్ సాధ్యం కాదని హాస్టల్ వార్డెన్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ చెప్పినట్లు తెలిసింది.