యాచారం, జూన్15: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరామ్ నాయక్ విమర్శించారు. మండలంలోని తమ్మలోని కూడా గేటు వద్ద నిర్వహించిన సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కగానే వాటన్నింటినీ విస్మరించిందని ఆయన మండిపడ్డారు.
పేదల సంక్షేమాన్ని పక్కకు పెట్టి ప్రతిపక్షాలను విమర్శించడమే రేవంత్ పనిగా పెట్టుకున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను తప్పనిసరిగా నెరవేర్చా లని ఆయన డిమాండ్ చేశారు. వానకాలం వచ్చిన రైతు భరోసా వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. అర్హులందరికీ రుణమాఫీ రైతు భరోసా పథకాలను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ, నాయకులు జంగయ్య, బ్రహ్మయ్య, భూషణ్, చందు నాయక్, విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.