కడ్తాల్, మే 9: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైనికులు మరణించడం బాధాకరమని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన సచిన్ యాదవ్, మురళి నాయక్‌కు శుక్రవారం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో యుద్ధంలో చనిపోయిన సైనికుల చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రామంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు మన సైన్యం దీటైన సమాధానం చెప్పాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతా ఒక్కటై భారత సైనికులకు బాసటగా నిలబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బీచ్యానాయక్, నాయకులు హీరాసింగ్, దళపతిగౌడ్, జవహర్ నాయక్, కిషన్, తులసీరాం, శంకర్, నర్సింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.