పూడూరు, ఆగస్టు 3 : యువకుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ గంజాయి విక్రయదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పూడూరు మండలం చంగముల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు.
అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా వాహనదారులకు పలు సూచనలు చేయాలని తెలిపారు. అధిక శాతంలో మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. రోడ్ల మార్గంలో, గ్రామాల్లో సీసీ కెమెరాలను దాతల సాయంతో ఏర్పాటు చేయాలన్నారు.
భూములకు అధిక రేట్లు ఉండడంతో భూ తగాదాలు జరుగుతున్నాయని వాటి నివారణకు ప్రయత్నించాలని తెలిపారు. అక్రమ రోడ్డు రవాణాపై దృష్టి పెట్టాలన్నారు. పోలీస్ సిబ్బంది నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ శాంతిభద్రతలను కాపాడాలన్నారు. వీరితో పాటు పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.