వికారాబాద్, ఆగస్టు 20 : జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్, దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు టీం మెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, ఆర్ఐలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్ టీం మెంబర్లు యాప్ ద్వారా ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలనే విధానాన్ని పీపీటీ ద్వారా తెలిపామన్నారు. వెరిఫికేషన్ మెంబర్లు నేటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభించాలని ఆదేశించారు.
దరఖాస్తులను పరిశీలించిన తర్వాత రిపోర్ట్‌ను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అనుమతి లేని లే అవుట్స్‌లోని ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసేందుకు మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) సుధీర్, లింగ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్లు జాకీర్ అహ్మద్, విక్రం సింహారెడ్డి, బలరాం నాయక్, మాధవి, ఆర్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.