యాచారం, సెప్టెంబర్3: అక్రమ రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ అన్నారు. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు మండలంలోని గాండ్లగూడ గేటు వద్ద హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ నరసింహరావు ఆధ్వర్యంలో, యాచారం పోలీస్‌స్టేషన్ వద్ద యాచారం సీఐ శంకర్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం వేర్వేరుగా ఏకకాలంలో నాగార్జున సాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం, గంజాయి, పశువులు, రేషన్ బియ్యం, ఇసుక తదితర వస్తువుల రవాణాపై పోలీసులు నిఘా పెట్టారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చలాన్లు విధించారు. వాహనాల తనిఖీలను మహేశ్వరం డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ మాట్లాడూతూ.. అక్రమ రవాణాను ఉపేక్షించేదిలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి యాచారం మీదుగా హైదరాబాద్‌కు అక్రమ రవాణా కొనసాగుతందన్నారు. ఇటీవలే గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు.
అనుమతులు లేకుండా పశువులు, ఇసుక, మద్యం రవాణా చేపడుతున్నారని, వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్, పోలీస్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీపీ రాజు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మాల్ బార్డర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఎస్ఐ నరేష్, యాచారం ఎస్ఐ మధు, గోపాల్, సత్యనారాయణ, పోలీసు సిబ్బంది ఉన్నారు.
తుర్కయాంజాల్ : గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ సాగర్ ప్రధాన రహదారిపై ఆదిభట్ల పోలీసులు తనిఖీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మన్నెగూడలో కొనసాగుతున్న వాహనాల తనిఖీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిషేధిత వస్తువులను సరఫరా చేసినైట్లెతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదిభట్ల ఇన్స్పెక్టర్ రాఘవేందర్‌రెడ్డి, ఎస్ఐలు, ఏఎస్ఐలు పాల్గొన్నారు.