తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ నెల 2న తెలంగాణ అవతరణ దినోత్సవంతో ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 22న అమరుల సంస్మరణ దినోత్సవంతో ముగిశాయి. 21 రోజులపాటు కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధు లు పకడ్బందీగా పెద్ద ఎత్తున నిర్వహించారు. విద్యార్థుల నుంచి పండు ముసలి వరకూ ఈ ఉత్సవాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతిఫలించేలా సాగాయి. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రతిరోజూ పండుగ వాతావరణం సంతరించుకున్నది. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టారు. అందరి నోటా తెలంగాణ నినాదమే ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలను మామిడి తోరణాలు, పూలు, లైటింగ్‌తో సుందరంగా ముస్తాబు చేశారు. రోజుకో శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టి తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
-షాబాద్, జూన్ 23
షాబాద్, జూన్ 23 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డిజిల్లాలో విజయవంతంగా ముగిశాయి. అన్ని స్థాయిల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు, ఉద్యమకారులు, సామాన్య ప్రజానీకం భాగస్వామ్యంతో ఓ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవంతో ప్రారంభమైన దశాబ్ది ఉత్సవాలు 22వ తేదీన గురువారం అమరుల సంస్మరణ దినోత్సవం వరకు 21 రోజుల పాటు వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రోజుకో ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో వినూత్నంగా వేడుకలు కొనసాగాయి. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కార్యక్రమాలు చేపట్టారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు క్లుప్తంగా వివరించారు. ఈ నెల 19వ తేదీన జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన హరితదినోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు.
జిల్లాలో 21రోజుల పాటు సంబురాలు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు ఓ పండుగ వాతావరణంలో నిర్వహించారు. అన్ని శాఖల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవంతో మొదలైన సందడి నిరంతరాయంగా కొనసాగింది. చివరి రోజు 22వ తేదీన గురువారం తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలను స్మరిస్తూ అమరుల దినోత్సవం దిగ్విజయంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ సంప్రదాయానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మామిడి తోరణాలు, పూలు, లైటింగ్‌తో ముస్తాబు చేశారు. నిత్యం బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో గ్రామాలన్నీ సందడిగా కనిపించాయి. రైతు దినోత్సవం రోజున రైతు వేదికలను అందంగా అలంకరించారు. ఎడ్లబండ్లతో ర్యాలీలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరువుల పండుగ రోజున ఆయా చెరువు కట్టలపై సమావేశాలు నిర్వహించి మిషన్ కాకతీయ పథకం ద్వారా చేపట్టిన పనులు, వచ్చిన ఫలితాలను సంబంధిత అధికారులు ప్రజలకు వివరించారు. అక్కడే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భోజనాలు చేశారు. అదే విధంగా నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి పారిశ్రామిక ప్రగతి, విద్యుత్ విజయోత్సవం, సంక్షేమం, మంచినీళ్ల పండుగ, మహిళా సంక్షేమం, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, సురక్షా, గిరిజన, విద్యా దినోత్సవాలను చేపట్టి ప్రజాప్రతినిధులు, అధికారులను సన్మానించారు.
ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం
తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ తదితర పథకాలపై పూర్తి వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో అభివృద్ధి నిధుల గురించి ప్రచారం చేశారు. ప్రతి పల్లెల్లో ర్యాలీలు, సభలు ఏర్పాటు చేశారు. బ్రోచర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించారు. మన ఊరు-మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు జడ్పీ చైర్పర్సన్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్,అన్ని శాఖల అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేశారు.