రంగారెడ్డి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర న్యాయం అందేలా పని చేస్తామని రంగారెడ్డి నూతన కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్‌లోని ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర న్యాయం జరిగేలా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు కులగణన పూర్తయ్యేలా అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు.
జిల్లాలో విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనతోపాటు జిల్లా సమగ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకెళ్తామన్నారు. సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ మంగళవారం బిజీబిజీగా గడిపారు. మొదటి రోజు కులగణనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, షాద్‌నగర్ ఆర్డీవోలు, జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.