వికారాబాద్, సెప్టెంబర్ 21 : సమాజ మార్పులో భాగంగా ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరిగింది. దీనికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడు తూ..నేర ప్రవృత్తి, వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని.. అత్యాచార కేసులను పోలీసు అధికారుల సహకారం తీసుకుని త్వరగా పరిష్కరించాలని డీవీఎం సీ సభ్యులకు సూచించారు. దళితులు ఎలాంటి వివక్షకు గురికాకుండా వారిలో ఆత్మైస్థెర్యం పెంపొందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం ప్రాధాన్యాన్ని కళాబృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రతినెలా పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఎస్సీడీవో మల్లేశం, డీబీసీడీవో ఉపేందర్, డీటీడీవో కమలాకర్‌రెడ్డి, డీఎఫ్‌వో వెంకన్న, డీఎస్వో మోహన్‌బాబు, కమిటీ సభ్యులు అనంతయ్య, జగదీశ్, దస్తప్ప, కిరణ్ రొనాల్డ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.