వికారాబాద్, డిసెంబర్ 27 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం కింద అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణపై స్పీకర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం దిశా నిర్దేశం సమావేశాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల పాటు కొనసాగే ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో 5 పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ వారం రోజుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా పాలన నిర్వహణపై ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రజాపాలన బృందాలు సమయ పాలన పాటించాలని, షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, వార్డులకు వెళ్లాలన్నారు. నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. గ్రామసభలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వద్ద తాగునీరు, టెంట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
మండల స్థాయి బృందాల ఏర్పాటు, గ్రామ సభ నిర్వహణపై ముందుగానే గ్రామాల్లో ప్రజలకు సమాచారం అందించేలా పత్రికలు, సోషల్ మీడియా, ఫ్లెక్సీలు, సైన్ బోర్డ్స్‌తో పాటు టాంటాం ద్వారా ప్రచారం చేపట్టాలని ఆయన తెలిపారు. అధికారులు అలసత్వం వహించకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా శ్రద్ధగా విధులు నిర్వహిస్తూ అమలు పరిచేందుకు కృషి చేయాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీవోలు స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. గ్రామస్థాయిలో పనిచేసే అధికారులు ప్రజలు తమ దరఖాస్తులను పూరించడంలో అనుమానాలను నివృత్తి చేస్తూ వారికి సహకరించాలని స్పీకర్ సూచించారు.
అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలతో మమేకమై సమన్వయంతో ప్రజలకు సేవలందించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకే కాకుండా.. నాలుగు నెలలకు ఒకసారి వివిధ అంశాలపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, ఆర్డీవో విజయకుమారి, డీఎస్పీ నర్సింహులు, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, కౌన్సిలర్లు సుధాకర్‌రెడ్డి, సురేశ్, శ్రీదేవి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
కొడంగల్ : రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని డ్వామా పీడీ కృష్ణణ్ సూచించారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయా శాఖల అధికారులు ప్రజాపాలన కార్యక్రమంపై సందేహాలు, సూచనలు అందజేశారు. అనంతరం డ్వామా పీడీ మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 100 ఇండ్లకు సంబంధించి ఓ అధికారిని ఏర్పాటు చేసి ఒక రోజు ముందుగానే దరఖాస్తులను ఇంటింటికీ అందించాలని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను లబ్ధిదారుల నుంచి గ్రామ సభలో స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు.
లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు సంబంధించి మూడు రోజుల ముందుగా గ్రామాల్లో దండోరా వేయించడంతో పాటు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. విద్యుత్, మిషన్ భగీరథ వంటి వాటికి సంబంధించి తదితర సమస్యల దరఖాస్తులు అందిస్తే స్వీకరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్‌కుమార్, జడ్పీటీసీ మహిపాల్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో పాండు, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఫారెస్ట్ డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్, వ్యవసాయాధికారి ఏడీఏ శంకర్‌రాథోడ్ పాల్గొన్నారు.