వికారాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జిల్లాలో గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగినట్లు వికారాబాద్ జిల్లా పోలీసు అధికారి స్నేహ మెహ్రా వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక క్రైమ్ నివేదికపై ఎస్పీ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 122 నేరాలు పెరిగినట్లు, వీటిలో అధికంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలు, చీటింగ్ కేసులు పెరిగినట్లు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా అన్ని నేరాలకు సంబంధించి గతేడాది 3691 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 3813 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గతేడాది 117 తీవ్రమైన కేసులు నమోదైతే, ఈ ఏడాది 122 కేసులు నమోదైనట్లు చెప్పారు. డబ్బుల కోసం హత్యకు సంబంధించిన కేసులు గతేడాది ఒక్క కేసు నమోదు కాగా.. ఈ ఏడాది 4 కేసులకు అన్ని కేసులను ఛేదించామన్నారు. గతేడాది 22 హత్య కేసులు నమోదైతే ఈ ఏడాది 25 కేసులు నమోదయ్యాయన్నారు. అత్యాచార కేసులు 63 నమోదుకాగా, సంబంధిత కేసులన్నింటిలో నిందితులను జుడిషియల్ రిమాండ్కు పంపామన్నారు. జిల్లా ప్రజలకు అన్ని వేళలా ఎస్పీ కార్యాలయం అందుబాటులో ఉంటుందని ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు.