రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో పరిహారం పంపిణీలో పంచాయితీ కొన సాగుతున్నది. ఈ విషయంలో కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు జోక్యం చేసుకుని రైతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారన్నా ఆరోపణలున్నాయి. జిల్లాలోని గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లను పరిహారం కింద కేటాయించింది. అలాగే, ఇప్పటి కే అర్హుల జాబితానూ ప్రకటించింది. దాని ప్రకారం బాధితులకు పరిహారం అందకుండా కొందరు అధికారులు జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిమ్మాపూర్, జబ్బార్‌గూడ, మాదాపూర్, పంజాగూడ, మీర్ఖాన్పేట తదితర గ్రామాల్లో భూములిచ్చిన బాధితులకు పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అర్హులకు పరిహారం అందకుండా కొందరితో కావాలనే ఫిర్యాదులు చేయిస్తున్నారన్నా ఆరోపణలున్నా యి. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ప్రభుత్వం 821 ఎకరాల్లో చేపడుతున్న భూసేకరణలోనూ అనర్హులు అధికంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బాధితులు ధర్నాకు సిద్ధం కాగా.. దిగొచ్చిన సర్కార్ మరోమారు రీ-సర్వేకు ఆదేశాలిచ్చింది. దీంతో మొండిగౌరెల్లిలో బాధితుల ఎంపిక కోసం మరోమారు సర్వే సాగుతున్నది.
ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ నిర్మాణంలో భాగంగా అవుటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)నుంచి మీర్ఖాన్పేట వరకు కొనసాగుతున్న భూసేకరణ పరిహారంలో ఎక్కడికక్కడ రైతుల మధ్య తగాదాలు తలెత్తుతున్నాయి. ఓఆర్ఆర్ నుంచి ఆకుతోటపల్లి వరకు సుమారు 41 కిలోమీటర్ల మేర చేపడుతున్న 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం సుమారు వెయ్యి ఎకరాలను సేకరించేందుకు సర్కార్ సిద్ధమైంది. భూసేకరణ సందర్భంగా అధికారులు అన్ని రకాల రికార్డులతోపాటు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి బాధితులను ఎంపిక చేశారు. కానీ, ఇటీవల కొందరు సంబంధంలేని వ్యక్తులు పరిహారానికి తాము కూడా అర్హులమంటూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కిందిస్థాయి అధికారులు, రైతుల మధ్య తగాదాలకు ఆజ్యం పోస్తుండడంతో పలు గ్రామాల్లో తీవ్రస్థాయిలో ఘర్షణలు తలెత్తుతున్నాయి.
యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో పరిశ్రమల పేరుతో టీజీఐఐసీ భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇటీవల అర్హుల జాబితాను ప్రకటించటంతో గందరగోళం తలెత్తింది. జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయంటూ గ్రామానికి చెందిన అనేకమంది ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ రీ-సర్వేకు ఆదేశించగా.. అధికారులు సర్వే చేస్తున్నారు. జిల్లాలో అసైన్డ్ భూములకు సైతం రూ.80 లక్షల వరకు పరిహారం వస్తుండడంతో రైతుల మధ్య తగాదాలు తలెత్తుతున్నాయి. కొందరు అధికారుల సహ కారంతో అడ్డుపుల్ల వేస్తే కలిసివస్తుందన్న భావనతో అనేకమంది అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్వయంగా కిందిస్థాయి అధికారులే తగాదాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.