రంగారెడ్డి, జూలై 10 (నమస్తే తెలంగాణ) ; జిల్లాలో డెంగీ విజృంభిస్తున్నది. ఈ ఏడాదిలో ఈ తరహా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగీ కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో డెంగీతో ఒక బాలుడు మరణించగా.. వివిధ చోట్ల 64 కేసులు నమోదయ్యాయి. ఇక ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య సైతం ఎక్కువగానే ఉన్నది. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిలువు దోపిడీ చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వివిధ రకాల పరీక్షల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు..
నిన్న మొన్నటి వరకు నగరాలు, మున్సిపాలిటీలలోనే కనిపించిన డెంగీ కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. జిల్లాలో పీహెచ్సీ, యూపీహెచ్సీలు 42 వరకు ఉండగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 39 డెంగీ కేసులు, మున్సిపాలిటీల పరిధిలో 21 కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. రెండురోజుల క్రితం చేవెళ్ల మండలానికి చెందిన 11 ఏండ్ల బాలుడు డెంగీ బారినపడి మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పల్లెలు, పట్టణాలు చిత్తడిచిత్తడిగా మారాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో పారిశుధ్య నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా మారింది. పరిసరరాల్లో నిల్వ ఉన్న నీటితో డెంగీ సంబంధిత దోమలు వృద్ధి చెందుతున్నాయి. సీజనల్ వ్యాధులు సైతం విజృంభిస్తున్నాయి. దీంతో చాలామంది జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఓపీకి తాకిడి పెరిగింది. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులలో సుమారు 8వేలకు పైగా విష జ్వరాల కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. సీజనల్ వ్యాధులపై ప్రజలను చైతన్యపర్చడం, ఫాగింగ్ వంటి చర్యలు మొక్కుబడిగానే ఉంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల నిలువు దోపిడీ..
జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తుండడంతో ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు రక్తకణాలు పడిపోవడం సర్వసాధారణం. ప్లేట్లెట్లు పడిపోయిన ప్రతి జ్వరాన్ని డెంగీగా భయపెట్టి ప్రైవేటు ఆసుపత్రులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయని మండిపడుతున్నారు. అవసరం లేకపోయినప్పటికీ నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లోనే ఉంచుకుని రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డెంగీ ఉన్నా.. లేకపోయినా ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు రకరకాల టెస్టుల పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు దందా నిర్విఘ్నంగా సాగుతున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు..
తీవ్ర జ్వరం, తలనొప్పి, కళ్ల నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, రుచిని కోల్పోవడం, జలుబు, వాంతులు వంటివి డెంగీ లక్షణాలుగా గుర్తించి అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా.. దాని బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు. దోమలు కుట్టకుండా..ప్రధానంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. డెంగీని ఆరంభ దశలో గుర్తిస్తే త్వరగా నయం కావడమే కాకుండా తక్కువ వ్యయంతో బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. ముదిరితే ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రాణాంతకంగా మారొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.