ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పరీక్షలకు అభ్యర్థులను నిర్ణీత సమయంలోనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించి, తర్వాత గేట్లు మూసేశారు. రంగారెడ్డి జిల్లాలో 56,394 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 60 శాతం మాత్రమే పరీక్షలు రాశారు. తట్టిఅన్నారంలోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల, హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీతోపాటు పలు పరీక్షా కేంద్రాలను రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 10,196 మంది ఎగ్జామ్స్ రాయాల్సి ఉండగా 60 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్ఏపీ కళాశాలతోపాటు పలు కేంద్రాలను, ఎస్పీ నారాయణరెడ్డి వికారాబాద్ సిద్ధార్థ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతోపాటు జిరాక్స్ సెంటర్లను మూసి వేయించారు. కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించలేదు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ