వికారాబాద్, జులై 17, (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగానే బుధవారం ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకుగాను ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా మొదట ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది. గతంతో పోలిస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు పెరిగాయి. జిల్లాలో 227 ఎంపీటీసీ, 20 ఎంపీపీ స్థానాలు, 20 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
గతంలో జిల్లాలో 221 ఎంపీటీసీ స్థానాలతో 18 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఎంపీటీసీల సంఖ్య అదనంగా ఆరు పెరగగా, జడ్పీటీసీ స్థానాలు రెండు పెంచుతూ నిర్ణయించారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగగా, స్థానిక ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన పరిగి నియోజకవర్గం లోని చౌడాపూర్ మండలం, కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలానికి ఈసారి ఎన్నికలు జరుగనున్నాయి.
బొంరాస్‌పేట్ మండలంలోని కొన్ని గ్రామాలు, నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి దుద్యాల మండలాన్ని, అదేవిధంగా కుల్కచర్ల మండలంలోని కొన్ని గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబుపేట్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి చౌడాపూర్ మండలాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పరిగి మండలం నుండి పరిగి మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేసినప్పటికీ మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట్ మండలం నుండి కొన్ని గ్రామాలు, నారాయణపేట జిల్లా కోస్గి మండలం నుండి కొన్ని గ్రామాలు జిల్లాలో విలీనం కావడంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య పెరిగింది.
కొత్తగా ఏర్పాటైన రెండు మండలాల్లోని ఆరు ఎంపీటీసీ స్థానాలు, రెండు ఎంపీపీ స్థానాలు, రెండు జడ్పీటీసీ స్థానాలకు మొదటిసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎన్నికల సిబ్బందిని ఆర్వో, ఏఆర్వో, పీవో, ఓపీవోలకు శిక్షణ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మరోవైపు ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను కూడా ఆయా మండలాలకు తరలించారు.
పట్టణీకరణ.. తగ్గిన స్థానాలు
రంగారెడ్డి, జులై 17 (నమస్తేతెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం రంగారెడ్డిజిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కావల్సిన సిబ్బంది, పోలింగ్ స్టేషన ఏర్పా టులో నిమగ్నమైంది. జిల్లాలో కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీలు ఏర్పాటైనందున ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఖ్య తగ్గింది. జిల్లాలో మొత్తం 27మండలాలకు గానూ వీటి పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 21 మండలాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి.
మిగతా 6 మండలాలు అర్బన్ ప్రాంతంలో ఉండటం వలన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. అలాగే, జిల్లా పరిధిలో 2019లో 257 ఎంపీటీసీ స్థానాలుండగా, ఔటర్ లోపలి మున్సిపాలిటీలైన పెద్దఅంబర్‌పేట్, శంషాబాద్ మున్సిపాలిటీల ఏర్పాటుతో కొన్ని ఎంపీటీసీలు తగ్గగా కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీలు ఏర్పాటు కావటంతో ఎంపీటీసీ సంఖ్య తగ్గింది. దీంతో ఎంపీటీసీల సంఖ్య 230కి చేరింది. అలాగే, జిల్లా వ్యాప్తంగా 7,94, 653మంది ఓటర్లుండగా ఇందులో 3,99,404పురుషులు, 3,95,216మంది స్త్రీలు ఉన్నారు. 33 మంది ఇతరులు ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు ఓటర్ల లెక్కకూడా తేలింది.
మున్సిపాలిటీల ఏర్పాటుతో తగ్గిన స్థానాలు
జిల్లాలో కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. చేవెళ్ల మండల పరిధిలో 37గ్రామపంచాయతీలు ఉండగా, వీటిలో 12గ్రామాలు కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఇక్కడ 17 ఎంపీటీసీలకు గానూ ప్రస్తుతం 10 ఎంపీటీసీలున్నాయి. 7 ఎంపీటీసీలను కోల్పోయింది. మొయినాబాద్‌లో 28 గ్రామపంచాయతీలుండగా, వీటిలో 9 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో 9 సర్పంచ్ స్థానాలను కోల్పోవల్సి వచ్చింది.
అలాగే, 17 ఎంపీటీసీ స్థానాలుండగా, ప్రస్తుతం 8 ఎంపీటీసీలు పోగా, 9 మాత్రమే మిగిలా యి. అలాగే, శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ, మీర్జాదిగూడలను ఇటీవల నార్సింగ్ మున్సిపాలిటీలో విలీనం చేయగా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్, తారామతిపేట, గౌరెల్లి, బాచారం గ్రామాలను పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఈ మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలను కోల్పోవల్సి వచ్చింది. అలాగే, రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల నిర్వాహణ కోసం 1354 పోలింగ్ బూత్‌లను గుర్తించారు.