Ground Water | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): భూగర్భజలాలు అంతకంతకూ దిగజారిపోతూ నగరవాసులకు కలవరం పుట్టిస్తున్నాయి. మరింత పాతాళానికి చేరుకుంటూ ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, నివాసగృహాల్లో బోర్లలో నీటి మట్టం మరింత కిందికి పడిపోతున్నది. ఫలితంగా ప్రైవేటు ట్యాంకర్లకు విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. జలమండలి వివిధ నీటి వనరుల మంచినీటి సరఫరాను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ అప్పుడే నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి.
రెండు నెలల ముందే..
వేసవి రాగానే సాధారణంగా మార్చి-ఏప్రిల్‌లో కనిపించే ప్రభావం ఈ సారి ఫిబ్రవరిలోనే మొదలైంది. రెండు నెలల ముందే ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆ మేరకు భూగర్భజల నీటిమ ట్టం కూడా క్రమంగా పడిపోతున్నది. 2024 డిసెంబర్-2025 జనవరి మధ్యే సరాసరిన నాలుగైదు అడుగుల మేర భూగర్భజలాలు కిందకు పడిపోయాయి. గతేడాది హైదరాబా ద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో సా ధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా వర్షపు నీరు ఇంకే పరిమాణం కూడా రోజురోజుకూ తగ్గుతుండటం, ఉష్ణోగ్రతలు జనవరి నుంచే మొదలు కావడంతో నీటి వినియోగం కూడా భారీగా పెరుగుతున్నది. దీంతో భూగర్భజలాలను ఎక్కడికక్కడ తోడు తుండటంతో నీటిమట్టం లోతునకు పడిపోతున్నది. భూగర్భజల వనరుల శాఖ నివేదిక ప్రకారం.. డిసెంబర్-జనవరి మధ్యే హైదరాబాద్‌లో 0.33 మీటర్లు, మేడ్చల్-మల్కాజిగిరిలో 0.86 మీటర్లు, రంగారెడ్డిలో 1.08 మీటర్లు, వికారాబాద్‌లో 1.64 మీటర్ల లోతునకు జలాలు పడిపోయాయి.
పదేండ్ల్ల తర్వాత మళ్లీ ఇప్పుడే..
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో గత పది సంవత్సరాల్లో జనవరి నెలలో ఇదే అత్యధిక తగ్గుదల అని భూగర్భజల వనరుల శాఖ నివేదిక చెబుతున్నది. దీంతోపాటు ప్రధానం గా రంగారెడ్డి జిల్లాలోకి వచ్చే పశ్చిమ భాగంలోని ఐటీ కారిడార్‌తోపాటు దానికి అనుసంధానంగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆ ప్రభావం జలమండలి, ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై పడింది. బంజారాహిల్స్ ప్రాంతంలో జలమండలి సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి వస్తున్నది. ఐటీ కారిడార్‌లోనూ ఈ ప్రభావం నెమ్మదిగా మొదలైంది. రెండు రోజుల కిందట ఈ సీజన్లోనే అత్యధికంగా 35.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ఆం దోళన కలిగిస్తున్నది.
అత్యంత ఆం దోళనకరంగా మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక లోతున భూగర్భజలాల లభ్య త ఉన్నట్లుగా భూగర్భజల వనరుల శాఖ నివేదికలో వెల్లడైంది. గతేడాది జనవరి తో పోలిస్తే హైదరాబాద్ మినహా మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భూగర్భజల నీటిమట్టం లోతుగా ఉన్నట్లు వెల్లడైంది. మునుపటికంటే మేడ్చల్‌లో 1.82 మీటర్లు, రంగారెడ్డిలో 0.29 మీటర్లు, వికారాబాద్‌లో 0.31 మీటర్ల లోపలికి జలాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలోనే అత్యంత లోతున భూగర్భజలాలు ఉన్న జిల్లాగా వికారాబాద్ (12.29 మీటర్ల లోతు) మొదటి స్థానంలో ఉంటే ఆతర్వాత మేడ్చల్ జిల్లా (11.21 మీటర్ల లోతున) రెండో స్థానంలో ఉంది. ఇది ఒకవిధంగా ఆందోళన కలిగించే పరిణామం. రానురాను ఎండలు పెరుగుతుండటం, భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేనందున మున్ముందు జలాలు మరింత లోతునకు పడిపోయే ప్రమాదముంది.