రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఖరీఫ్ సాగు సగానికే పరిమితమైంది. గత వర్షాకాలంలో జిల్లాలో 4,00,000 పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 2,50,000 ఎకరాల్లోనే పంటలు సాగయ్యా యి. వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటడం, వరికి బదులు ఇతర పంటలు వేయాలన్న అధికారుల ప్రచారం తో జిల్లాలో ఇప్పటివరకు 45,000 ఎకరాల్లోనే వరి పంట సాగైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. గత వానకాలంలో వరి పంట 1,62,000 ఎకరాల్లో సాగు అయిం ది. మరో లక్ష ఎకరాలకు పైగా వరి పంట సాగు కావల్సి ఉండగా..అందులో సగమైనా అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే, గత వానకాలంలో పత్తి 1,90,000 ఎకరాల్లో సాగుచేయగా.. ఇప్పటివరకు 1,60,000 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే, మొక్కజొన్న సాగు కూడా గణనీయంగా తగ్గింది. గతేడాది 80 వేల ఎకరాల్లో సాగు కాగా, ఈ సీజన్లో 56వేల ఎకరాలకే పరిమితమైంది.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జిల్లాలో 1,60,000 ఎకరాల్లో పత్తిపంటను సాగు చేసినా వర్షాలు కురువకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులు ట్యాం కర్లు, స్ప్రింకర్ల ద్వారా నీరుపోసి పంటను బతికించుకునేందుకు కష్టపడు తున్నారు.
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లు ఎండిపో యే పరిస్థితి ఏర్పడింది. గత వర్షాకాలంలో ఒక్కో బోరుబావి కింద ఐదు నుంచి ఆరు ఎకరాలు సాగు కాగా..ఈ సీజన్లో రెండు ఎకరాలకే పరిమితమైంది. జిల్లాలో వరిపం ట సాగు గణనీయంగా తగ్గింది. గత సీజన్ తో పోలిస్తే ఇప్పుడు సుమారు యాభై నుంచి ఆరవై వేల ఎకరాలు సాగుకు నోచుకోని పరిస్థితి ఏర్పడింది. అలాగే.. జిల్లాలోని రైతులను తీవ్ర సమస్యలు వెంటాడుతున్నాయి. రైతులను ఎరువుల కొరత వేధిస్తున్నది. పెరిగిన డీజిల్ ధరలతో యంత్రాల ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో రైతులు పెట్టుబడులూ రాని పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు.