పాపన్నపేట,సెప్టంబర్ 30 : యాసంగిలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి, నూనెగింజలు, పప్పుదినుసుల పంటలను సాగు చేయాలని కేవీకే తునికి శాస్త్రవేత్త డా. ఎం. ఉదయ్ కుమార్ రైతులకు సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చీకోడ్ గ్రామంలో బుధవారం ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) సౌజన్యంతో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే తునికి శాస్త్రవేత్త డా. ఎం. ఉదయ్ కుమార్ సేంద్రియ వ్యవసాయ విధానాలు, జీవ ఎరువుల వినియోగం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నానో యూరియా, నానో డీఏపీ, ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కర్బనం వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
యాసంగిలో సాగు చేయాల్సిన పంటల ఎంపికపై పలు సూచనలు చేశారు. మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస రాజు మాట్లాడుతూ నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. నూనెగింజలు, పప్పుదినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపాలని కోరారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో రెండు, మూడు ఎకరాల ఆరుతడి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చీకోడ్ చైర్మన్ సిద్ధంశెట్టి దత్తరాజు, సీఈఓ పి. ప్రశాంత్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.