Shamshabad : శంషాబాద్ (Shamshabad) లోని రాజీవ్‌గాంధీ (Rajiv Gandhi) అంతర్జాతీయ విమానాశ్రయం (International) లో ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానం టేకాఫ్ (Flight Take Off) అయిన కాసేపటికే పైలట్ దానిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే 591 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 45 మంది ప్రయాణికులతో శంషాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించారు. వారి అనుమతితో విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని విమానాశ్రయ వర్గాలు ధ్రువీకరించాయి.
అనంతరం సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీచేసి మరమ్మతులు ప్రారంభించింది. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడకు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తెలిపింది.