కొత్తూరు, జూన్ 7: పచ్చని పంట పొలాలతో విరాజిల్లుతున్న సిద్ధాపూర్లో కాలుష్యాన్ని నింపే డంపింగ్ యార్డు వద్దే..వద్దని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ అన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేక ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యం లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు డంపింగ్‌యార్డు ఏర్పాటు ప్రతిపాదిక భూముల్లో వంటావార్పు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో డంపింగ్‌యార్డు ఏర్పాటును అడ్డుకుని తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. దానిని రద్దు చేసేవరరూ కలిసి కట్టుగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మె సత్యనారాయణ మాట్లాడు తూ.. డంపింగ్‌యార్డు వ్యతిరేక ఉద్యమంలో తమతో కలిసి వచ్చేందుకు ఇతర పార్టీల నాయకులు జంకుతున్నారని మండిపడ్డారు. ఐటీ కారిడార్, ఫుడ్ ప్రాసెసింగ్ యానిట్ల ఏర్పాటు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధాపూర్‌లోని రైతుల నుంచి 340 ఎకరాలను సేకరించిందని.. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూముల్లోని 80 ఎకరాల్లో ఎకో పార్కు పేరుతో హైదరాబాద్, జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డును ఇక్కడికి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రతిపాదనను సర్కార్ వెనక్కి తీసుకునే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. కాం గ్రెస్ నాయకులకు దమ్మూధైర్యం ఉంటే డంపింగ్ యార్డు ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారులతో చెప్పిం చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ..బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి పరిసర గ్రామాల ప్రజలు కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, వడ్డె బాలయ్య, కడల శ్రీశైలం, నరేందర్‌రెడ్డి, బాబురాజూనాయక్, రెడ్యానాయక్, వడ్డె మల్లేశ్, రాజూనాయక్, నానూనాయక్, జాప్లా, చందర్‌నాయక్, కుమ్మరిగూడెం పాండు, వడ్డె మహేశ్, జామకాయల కృష్ణయ్య, ఎమ్మె రాఘవేందర్, గూడూరు శ్రీను, ఎమ్మె మల్లేశ్, దండు తిరుపతయ్య, గొడుగు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

డంపింగ్‌యార్డు వద్దంటూ తీర్మానం
పెద్దఅంబర్‌పేట : అబ్దుల్లాపూర్ మండలంలో డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ కుంట్లూరు డివిజన్లోని బాచారం గ్రామస్తులు ఆదివారం తీర్మానం చేశారు. డంపింగ్‌యార్డును ఏర్పాటు చేస్తే వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతుందని, వాతావరణం దెబ్బతింటుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతా యన్నారు. డంపింగ్ యార్డుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించారు.