షాద్‌నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను 100శాతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే ప్రతి పల్లెలో లక్షల నిధులను వెచ్చించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాల వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి, కిషన్‌నగర్, పీర్లగూడ, మొండోనిరాయి తాండ, కంసాన్పల్లి, గిరాయిగుట్ట తాండ, వెంకట్‌రెడ్డిపల్లి, బీమారం, ఉప్పగడ్డ, చించోడ్, లపల్లి, మొగిలిగిద్ద, రంగంపల్లి, ఎలికట్ట గ్రామాల్లో పర్యటించి సీసీరోడ్డు పనులను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 16 గ్రామాల్లో రూ. 90లక్షల నిధులను వెచ్చించి నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫరూఖ్‌నగర్ మండలంలో రూ. 1.84కోట్ల నిధులతో సీసీ రోడ్లను నూతనంగా అందుబాటులోకి తెస్తున్నామనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు.
ఇప్పటికే పల్లెప్రగతి ద్వారా ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఇందులో భాగంగానే భీమారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాక్య భవనాన్ని ప్రారంభించారు. రూ. 12లక్షల నిధులతో రంగంపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. లపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పర్యటక నేపథ్యంలో అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే బృందానికి గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు బెంది శ్రీనివాస్‌రెడ్డి, మన్నె నారాయణ, దామోదర్, కృష్ణయ్య, శ్రీశైలం, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.