షాబాద్ : పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి (MEO) లక్ష్మణ్ నాయక్ అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిమ్మన్నోళ్ల శ్రీరామ్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేపడుతున్నట్లు వివరించారు. పేద విద్యార్థులకు దాతల ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు.
దాత తిమ్మనోల్ల శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సంపాదించిన దాంట్లో కొంత పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, సుభాష్ రావు, బందయ్య, నర్సింలు, మల్లేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అలివేలు, పాఠశాల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.