వికారాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రైతుభరోసా, రుణమాఫీల్లో అర్హులకు భారీ కోత పెట్టి ధోకా చేసిన రేవంత్ సర్కార్ ధాన్యం కొనుగోళ్లలోనూ ముప్పుతిప్పలు పెడుతున్నది. మిల్లర్లు అందినకాడికి దోచుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వెంటనే బిల్లింగ్ పూర్తయ్యేది. కానీ, ప్రస్తుతం బిల్లింగ్ బాధ్యత మిల్లర్లకు అప్పజెప్పడంతో రైతులను నట్టేట ముంచుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత మిల్లుల్లో మరోసారి తూకం వేసి బిల్లింగ్ చేస్తుండడంతో భారీ మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ దోపిడీ వ్యవహారం సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని అన్నదాతలు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత మిల్లర్లు బిల్లింగ్ వేసే ముందు మరోసారి తూకం వేస్తూ, తక్కువ చూపిస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసిన తర్వాత మిల్లులకు ధాన్యం చేరే వరకు రైతులకే బాధ్యత అప్పగించడంతో ఒక్కో రైతు తాను తీసుకెళ్లిన ధాన్యం ఖాళీ అయ్యేందుకు వారం, పది రోజులపాటు పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
బషీరాబాద్ మండలానికి చెందిన రైతు మొదట కొనుగోలు కేంద్రం వద్ద 500 బస్తాలను తూకం వేయగా, ఆ ధాన్యాన్ని రైస్ మిల్లుకు చేరుకొని తూకం వేసే సమయానికి ఏకంగా 24 బస్తాలు మాయం చేసి, బిల్లింగ్ పూర్తి చేశారు. ఏకంగా 24 బస్తాలు తక్కువగా వచ్చాయని రైతు నిలదీయడంతోపాటు సంబంధిత శాఖ జిల్లా అధికారికి ఫిర్యాదు చేస్తే 10 బస్తాలను సదరు మిల్లర్ కలపి బిల్లింగ్ చేయడం గమనార్హం. సదరు అధికారి కూడా మిల్లర్లను ప్రోత్సహించేలా నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు సమాచారం.
రైతులు పండించిన పంటను విక్రయించేందుకు అరిగోస పడుతున్నారు. గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో చాలామంది రైతులు నష్టపోతున్నారు. ప్రతిఏటా ఈ సమయానికి ధాన్యం సేకరణ ముగిసేది. ఈ ఏడాది మాత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దోమ, కులకచర్ల, బషీరాబాద్ తదితర మండలాల్లో రైతులు వారం, పది రోజులుగా ధాన్యాన్ని విక్రయించేందుకు పడిగాపులు పడుతున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు.
క్వింటాకు 10 కిలోల వరకు తరుగు పేరిట తూకం వేస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల ధాన్యాన్ని తూకం వేస్తుండగా.. తరుగు ఒక్కో బస్తాకు 4 కిలోలు తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా ధాన్యాన్ని సేకరించలేదు. ఇప్పటివరకు కేవలం 39,532 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 7,523 మంది రైతుల నుంచి 39,532(రూ.94.43 కోట్ల విలువ) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొని..వాటికి సంబంధించి రూ.57 కోట్ల చెల్లింపులు మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మరో 37 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నది. ఈ యాసంగిలో లక్షా5 వేల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 1,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369లుగా ప్రభుత్వం మద్ద తు ధర నిర్ణయించింది.