రంగారెడ్డి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని హైదరాబాద్ శివారులో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసి మూడు నెలలు దాటినా ఇంకా పౌర సేవలు మాత్రం గాడిన పడలేదు. ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు జీహెచ్ఎంసీలో కలపొద్దని ఎంత మొత్తుకున్నా సర్కార్ మాత్రం పట్టించుకోకుండా హడావుడిగా జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో గతేడాది డిసెంబర్ 3న కలిపింది. నెలలు గడిచినా అక్కడ మాత్రం పౌర సేవలు, పారిశుధ్యం, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా జోనల్ కమిషనర్ పరిధిలోనే పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ జోనల్ కమిషనర్ ఉన్నా ఆయనకు నిర్ణ యం తీసుకునే అధికారం ఇవ్వలేదని సమాచారం. సమస్యలను చెప్పుకొనేందుకు ఎక్కడో ఉన్న జోనల్ కమిషనర్ వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే బాగుండేనని పేర్కొంటున్నారు
జిల్లాలోని హైదరాబాద్ శివారులో ఉన్న పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీలతోపాటు బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ కార్పొరేషన్లలో కొన్నింటిని ప్రభుత్వం శంషాబాద్ జోన్లో విలీనం చేయగా..మరికొన్నింటిని శేరిలింగంపల్లి జోన్లో కలిపింది. ఈ మున్సిపాలిటీల్లో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు జోనల్ కమిషనర్ కార్యాలయానికి పరుగులు తీయాల్సి వస్తున్నది.
శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపి మూడునెలలు దాటినా పౌరసేవలు అస్తవ్య స్తంగా ఉన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. భవన నిర్మాణంతోపాటు అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇతరత్రా నిర్మాణాల అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. ఎల్ఆర్ఎస్ తోపాటు ఇతరత్రా ఆన్లైన్ సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో నిర్మాణాల అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని ప్రజలు వాపోతున్నారు. అలాగే, ఇంటినంబర్ల కేటాయింపులోనూ ఆన్లైన్ సేవలు సరిగ్గా అందుబాటులోకి రాలేదని అధికారులు సమా ధానం చెప్తున్నారని పేర్కొంటున్నారు. అలాగే, జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున వెలుస్తున్నా యన్న ఆరోపణలున్నాయి. అలాగే, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్యం అస్తవ్యస్తం గా మారిందని.. ప్రధాన రోడ్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధుల్లో ఉన్నప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందుల్లేవని.. జీహెచ్ఎంసీలో కలపడంతోనే సమస్యలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్ మున్సిపాలిటీలతో పాటు బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లు శంషాబాద్ జోనల్ కమిషనర్ పరిధిలోకి వెళ్లగా.. నార్సింగి, మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీలు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పరిధి లోకి వెల్లాయి. విలీన మున్సిపాలిటీల్లో డిప్యూటీ జోనల్ కమిషనర్లు అందుబాటులో ఉన్నా వారికి సమస్యల పరిష్కారంపై అధికారాలు ఇవ్వలేదు. దీంతో ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా జోనల్ కమిషనర్ వద్దకు వెళ్ల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.