చేవెళ్ల రూరల్, మే 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటినా ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు శేరి రాజు అన్నారు. గురువారం శేరి రాజు చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు 250గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు వాటిపై ఊసెత్తడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం ప్రభుత్వం గాలికొదిలేసిందని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయిందన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, రాజీవ్ యువ వికాస్ పథకం, ఇందిరమ్మ ఇండ్లల్లో 20 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఉద్యోగాల కల్పన చేపట్టాలని అన్నారు. లేదంటే హామీలు అమలయ్యేవరకు మరో ఉద్యమం చేయాల్సివస్తుందని హెచ్చరించారు.