దోమ,జులై 12; అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేసి సత్వరమే వాడుకలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.3 దోమ మండల పరిధిలోని బొంపల్లి, బాసుపల్లి, దోమ ఉన్నత, ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలను కలెక్టర్ సందర్శించి మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు.
పాఠశాలల్లో వంట గది, వాటర్ సంపు, టాయిలెట్స్, విద్యుత్తు తదితర మౌలిక వసతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ సప్లయ్ కనెక్షన్లు, మిషన్ భగీరథ నీటి సరఫరా వంటి వివరాలు సేకరించి గ్రౌండ్ రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. బడుల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా జాగ్రత్తలు తీసుకోలాలని ఉపాధ్యాయులకు సూచించారు. దోమ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించిన ఆయన వెంటనే తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఆదేశించారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రతి రోజూ ఓపీ సేవలకు ఎంత మంది వస్తున్నారు.. ఎంత మంది స్టాఫ్ ఉన్నారు.. అంబులెన్స్ సౌకర్యం ఉందా.. లేదా అనే అంశాలను డాక్టర్ రజితను అడిగి తెలుసుకున్నారు. ఓపీ స్లిప్‌లు అట్టలపై రాసి ఇ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాలతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మహిళలు తీసుకునే సబ్సిడీ లోన్స్ ద్వారా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారని అడుగగా.. కుట్టు మిషన్లు, కోళ్ల ఫామ్‌లు, క్యాంటిన్లు, కిరాణా షాపులు పెట్టుకొని నడుపుతున్నట్లు వారు బదులిచ్చారు.
ఐకేపీ ద్వారా జరిగే వరి ధాన్యం కొనుగోలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దోమ కేజీబీవీని సందర్శించిన ఆయన వంట గది, టాయిలెట్స్ ,రన్నింగ్ వాటర్ సప్లయ్‌ని పరిశీలించి అతి త్వరలో మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలికల అందరితో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీవో మహేశ్‌బాబు, ఎంఈవో హరిశ్చందర్, ఏవో ప్రభాకర్‌రావు, ఎపీఎం సురేశ్, ఏపీవో దస్తయ్య, డాక్టర్ రజిత, ప్రధానోపాధ్యాయులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.