వికారాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వానంగా తయారైంది. పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమీలేదు. జిల్లా కేంద్రంలో రోజుకో చోట డ్రైనేజీ లీకేజీలతో ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహిస్తున్నది. దీనిపై సంబంధిత అధికారులతోపాటు ఇటీవల కొలువుదీరిన కొత్త పాలకవర్గం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లపాటు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు లేకుండానే ప్రత్యేకాధికారులతో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పాలన కొనసాగింది. ఇటీవల గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు కొలువుదీరి, నిధులొచ్చినప్పటికీ పట్టించుకోవడంలేదు. బీఆర్ఎస్ హయాంలో అవార్డులు సొంతం చేసుకున్న స్వచ్ఛ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారంతో దర్శనమిస్తుండటం శోచనీయం. బీఆర్ఎస్ సర్కారు హయాంలో రోడ్లు, మురుగునీటి కాల్వలను ప్రతిరోజూ శుభ్రం చేయగా.. గత రెండున్నరేండ్లుగా ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా చెత్త కనిపించకుండా ఇంటింటికీ వెళ్లి తడి-పొడి చెత్తలను వేర్వేరుగా పంచాయతీ కార్మికులు సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో ఇండ్ల మధ్యలో చెత్తాచెదారంతో డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ లోపించడంతో ఎక్కడ చూసినా మురుగు నీరు దర్శనమిస్తున్నది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లన్నీ కంపుగా మారిపోతున్నాయి. తగు పరిష్కార చర్యలు తీసుకోవడంలో ఆయా మున్సిపాలిటీల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాండూరులోని జిల్లాసుపత్రిలో పారిశుధ్యం పాటించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పైప్లైన్ల లీకేజీలతో ఆసుపత్రి పరిసరాల్లో మురుగు కంపుతోపాటు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోగాల బారిన పడి వస్తున్న ప్రజలు ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులతో కొత్త రోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే విషయంలో ఈ నెల 11న కలెక్టర్ ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.