Tanduru | తాండూరు రూరల్, ఏఫ్రిల్ 8 : తాండూరు మండలం పర్వతాపూర్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేక మురుగు కాలువల్లో గడ్డి మొలిచింది. గిరిజనులు నివసించే తండాలో మంచినీటి సమస్య తిష్ట వేసింది. గ్రామంలో రెండు బోర్లు ఉండగా, ఒక బోరు మాత్రమే కొనసాగుతోంది. మరో బోరు పాడైపోవడంతో గిరిజనులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో గ్రామంలో పారిశుధ్య కార్మికుల చేత ఎప్పటి కప్పుడూ తడి, పొడి చెత్త సేకరణ చేసేవారు. చెత్త సేకరించే ట్రాక్టర్ ట్రాలీ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మూలకు పడిపోయింది. నిర్వహణ లేక పోవడంతో పల్లె పకృతి వనం గేటు ఊడిపోవడంతో పందులు యధేచ్చగా పల్లెపకృతివనంలోకి వెళుతున్నాయి.
పర్వతాపూర్ గ్రామంలోని గిరిజన కాలనీ(తండా)లో మంచీనీటి కొరత తీవ్రంగా ఉంది. పైభాగంలో ఉన్న గిరిజనులకు తాగునీరు అందడంలేదు. కింద ఉన్న గ్రామస్తులకు మాత్రమే తాగునీరు వస్తోంది. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు. ఉన్న బోౖర్లెనా మరమ్మత్తు చేసి, గ్రామస్తులను తాగునీరు అందించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గిరిజన కాలనీలో తాగునీరు లేదు. తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో రెండు బోర్లు ఉంటే, గిరిజనులకు నీరందించే బోరు పాడైపోయింది. మరో బోరు ఉన్నా పైకి నీరు రావడంలేదు. అధికారులు స్పందించి వెంటనే కొత్త బోరు వేసేందుకు చర్యలు తీసుకోవాలి.