ఇబ్రహీంపట్నం, జూలై 13 : గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో మురుగుకాల్వలను శుభ్రం చేయడం, పిచ్చిమొక్కల తొలగింపు, దోమలు, ఈగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ పనులు చేసేవారు. ఇందుకోసం గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెలా నిధులను ప్రత్యేకంగా విడుదల చేసింది.
ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసి.. ప్రత్యేకాధికారుల పాలన రావడంతో గ్రామాలు మురికికూపాలుగా మారుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రత్యేకాధికారులు గ్రామాలవైపు కన్నెత్తి చూడడంలేదని.. సమస్యలు ఎవరికీ చెప్పాలో అర్థం కావడంలేదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోమలు, ఈగల మోత
గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై మురుగునీరు పారుతున్నది. అంతేకాకుం డా ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు, ఈగ లు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధులతో మంచాన పడుతున్నారు. పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేకాధికారులు పట్టించుకోవడంలేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని సుమారు 87 గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినా వారు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విషజ్వరాలు ప్రబలుతుండడంతో వారు ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే సరైన మందులు, చికిత్సలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుధ్య పనులు నిల్..
గ్రామాల్లో పారిశుధ్య పనులను చేపట్టడంలేదు. గత కేసీఆర్ హయాంలో వానకాలంలో దోమలు, ఈగలు విజృంభించకుండా పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా మురుగుకాల్వలను శుభ్రం చేయడం, పిచ్చిమొక్కల తొలగింపు, దోమలు, ఈగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ తదితర పనులు చేయించేవారు. అనుకోని పరిస్థితుల్లో ప్రజలు రోగాలబారిన పడితే వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచేవారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టడంలేదు. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికీ చాలా దవాఖానల్లో మందులే లేవ్.
– జెర్కోని రాజు, బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు