Navjot Kaur Sidhu : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ నాయకురాలు నవజోత్ కౌర్ సిద్ధు ఫైరయ్యారు. రాహుల్ గాంధీ మాటలకు, చేతలకు సంబంధం లేదని విమర్శించారు. కోయంబత్తూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై, రాహుల్ గాంధీ విధానాలపై విమర్శలు చేశారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీలో నవజోత్ కౌర్ కీలకంగా వ్యవహరించారు. క్రికెటర్, రాజకీయ నేత నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ సింగ్ కౌర్.
ఆమె పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటీవల ఆ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి ఇటీవల సస్పెండ్ చేశారు. అప్పటినుంచి నవజోత్ కౌర్.. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా ఘాటైన విమర్శలు చేశారు. ‘‘పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విభాగంలో తీవ్ర అవినీతి ఉంది. ఇంకా ఇలాగే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం ఖాయం. అధికారం చేపట్టడం కష్టం. రాహుల్ గాంధీ మాటలకు, చేతలకు సంబంధం లేదు. రాహుల్ చెప్పే మాటలు బాగుంటాయి. కానీ, చేసేవి మాత్రం భిన్నం. పంజాబ్లో ఆయన నియమించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్నవారు అవినీతికి పాల్పడుతున్నారు.
ఎనిమిది నెలలుగా ఈ విషయం ఆయనతో చెప్పడానికి ప్రయత్నిస్తూ టైం అడిగా. కానీ, ఇవ్వలేదు. ఇప్పటికే పంజాబ్లో టిక్కెట్లు అమ్ముకున్నారు. రాహుల్ గాంధీకి వాస్తవ పరిస్థితులు తెలియవు. కిందిస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు. రాహుల్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనకు అసలు విషయం తెలియనీయరు. పార్టీలో ఏం జరుగుతుందో నాయకత్వం గుర్తించకపోతే దాని పరిణామాల్ని అనుభవించకతప్పదు’’ అని నవజోత్ కౌర్ వ్యాఖ్యానించారు. ఇక.. ఇటీవల రాహుల్ గాంధీని నవజోత్ కౌర్ పప్పు అని కూడా విమర్శించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను మరింత దూరం పెట్టింది.