తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గత 20 రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ మద్దతు తెలుపుతున్నాయి. దీంతో పలు సేవలకు అంతరాయం కలుగుతున్నది. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ)
సమగ్ర శిక్షా అభియాన్‌లో 739 మంది ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తున్నారు. వీరి సమ్మెతో విద్యాశాఖలో పలు రకాల సేవలకు బ్రేక్ పడింది. పీఎం పోషణ్, ట్రెజరరీ, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎంఈవో కార్యాలయాల్లో డాటా ఎంట్రీలుగా పని చేసే ఉద్యోగులు సమ్మె చేయడంతోపాటు మధ్యాహ్న భోజన పథకంలో వంట చేసే కూలీల బిల్లులు అమాంతం నిలిచిపోవడంతో వారు నిత్యం అవస్థలు పడుతున్నారు. దీంతో మండలాల్లో పని చేస్తున్న వంట కార్మికుల అకౌంట్లో డబ్బులు పడక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కేజీబీవీ, భవిత కేంద్రాల్లో బోధన లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వికారాబాద్ : తమను క్రమబద్ధీకరించి, సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు ఆగవని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగ్యానాయక్ స్పష్టం చేశారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు చేపట్టిన దీక్షలు గురువారానికి 21వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు. సమ్మెలో వికారాబాద్ జిల్లాలో ఉన్న 620 మంది సమగ్రశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో ఎంఆర్సీ, సీఆర్సీ, పాఠశాల, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్ విభాగాల ఉద్యోగులు పాల్గొని.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, తక్షణమే పేస్కేల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మోడల్ స్కూల్లో సమగ్ర శిక్షాకు అనుబంధంగా పనిచేస్తున్న ఉద్యోగులకూ న్యాయం చేయాలన్నారు. దీక్షలో మెసెంజర్ అధ్యక్షుడు శ్రీశైలం, మహిళా నాయకురాలు ప్రభావతి, డీపీవో శేఖర్, పీటీఐ రవికుమార్, ఆయా మండలాల కేజీబీవీ పాఠశాలల ఎస్వోలు స్వరూప, స్రవంతి , సునీత, పల్లవి, దేవి, రాజేశ్వరి, సుమిత్ర, రఘుసింగ్, రఘు, ప్రశాంత్, వెంకట్‌రెడ్డి, దశరథ్, మాధవి, రవి, తిరుమలేశ్, మమత, మోహన్, జ్యోతి, అనిత, రమాదేవి, కృష్ణయ్య , నర్సింహులు, నాగయ్య పాల్గొన్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఇబ్రహీంపట్నం మానవ వనరుల కార్యాలయంలో గత 18 ఏండ్లుగా డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నా. నేటికీ పనికి తగిన వేతనం లేదు. విద్యాశాఖలో వెట్టి చాకిరి చేస్తున్నా.. ప్రభుత్వం తమ పనిని గుర్తించడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. అప్పటి వరకు ఆందోళనను కొనసాగుతాయి.
– జే.సంపత్, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి