ఆమనగల్లు, జూలై 6 : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా యథేచ్ఛగా సాగుతున్నది. నర్సరీ, యూకేజీ మొదలుకొని పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులే కాకుండా యూనిఫాంలు కూడా పాఠశాలల పరిధిలో సిబ్బందితో విక్రయిస్తున్నారు.
మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు సమీపంలోని గదులను అద్దెకు తీసుకుని పుస్తకాల దందా కొనసాగిస్తున్నారు. ఏటా ఇదే తంతు సాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు చేసిన సందర్భాల్లో నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు షరామామూలే అన్నచందంగా వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలు తప్పనిసరిగా తమ పాఠశాలల్లోనే పుస్తకాలను కొనుగోలు చేయాలని సూచిస్తుండడంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక అడిగినంత డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి. పాఠ్య పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేలకు వేలు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై పెనుభారం మోపుతున్నారని వాపోతున్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి తేదీ 30-5-2024 నాడు ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మండలంలోని పాఠశాలలు జిల్లా విద్యాధికారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తంతుపై మండల విద్యాధికారి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.